ఆ కాంప్లిమెంట్‌ నాకు ఆస్కార్‌తో సమానం

30 Jul, 2018 04:38 IST|Sakshi
రాహుల్‌ రవీంద్రన్‌

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్టర్‌ అవుదాం అని. కానీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరదాం అంటే ఒక్క డైరెక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కుదర్లేదు. సడన్‌గా ఆడిషన్స్‌కి పిలిచారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని కూడా ఆడిషన్‌ చేస్తారేమో అనుకున్నాను. కట్‌ చేస్తే ఈ సినిమాలో హీరో నువ్వే అన్నారు. కొన్ని డబ్బులు వస్తాయి, సినిమా కూడా నేర్చుకోవచ్చు అని కంటిన్యూ అయిపోయాను’’ అని రాహుల్‌ రవీంద్రన్‌ అన్నారు.  సుశాంత్, రుహాని శర్మ జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘చి ల సౌ’. సిరుని సినీ కార్పరేషన్‌ పతాకంపై జశ్వంత్‌ నడిపల్లి నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఆగస్ట్‌ 3న అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు విశేషాలను రాహుల్‌ పంచుకున్నారు.

► నాలుగేళ్ల క్రితం ఇంక డైరెక్టర్‌గా సినిమా స్టార్ట్‌ చేద్దాం అని అనుకున్నాను. అప్పుడు కుదర్లేదు. ఈ లోపు కొన్ని సినిమాలు సైన్‌ చేసి హీరోగా బిజీ అయిపోయా. చైతన్య–సమంత వెడ్డింగ్‌ అప్పుడు సుశాంత్‌ని కలిశాను. ఆ తర్వాత ఓ రోజు ఫొన్‌ చేసి కథ వినాలి బ్రో అంటే ‘మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్నామా?’ అన్నాడు సుశాంత్‌. కాదు నేనే డైరెక్టర్‌ అని చెప్పాను. నా దగ్గర ఉన్న రెండు కథలు చెప్పా, సుశాంత్‌ లవ్‌ స్టోరీ సెలెక్ట్‌ చేసుకున్నాడు.

► డైరెక్షన్‌ చేస్తున్నాను అని ఇండస్ట్రీలో ఎవ్వరికీ చెప్పలేదు. కేవలం నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌కి తప్పా. ఒకవేళ డైరెక్షన్‌లో అనుకున్నట్టు జరగకపోతే యాక్టింగ్‌ కెరీర్‌ కూడా ఎఫెక్ట్‌ అవుతుంది ఆలోచించుకో అని ‘వెన్నెల’ కిశోర్‌ చెప్పాడు. అలాగే ఈ సినిమా టైటిల్‌ను కూడా ‘వెన్నెల’ కిశోర్‌ చెప్పాడు.

► 24 గంటల్లో జరిగే కథ ఈ సినిమా. 27 ఏళ్ల అబ్బాయి, 24 ఏళ్ల అమ్మాయి ఇద్దరూ పెళ్లి ముందు జర్నీ స్టోరీ లైన్‌.  ఈ జనరేషన్‌లో అందరూ ఇండివిండ్యువాలిటీ కోరుకుంటున్నారు. మనకు కాబోయే పార్టనర్‌ వీళ్లే అని ఎలా తెలుసుకోగలం? అనే పాయింట్‌ చుట్టూ కథ ఉంటుంది. సుశాంత్‌ బయట ఎలా ఉంటాడో సినిమాలోనూ అలానే చూపించాం. అసలు మేకప్‌ వాడలేదు.

► డైరెక్టర్‌ అవుతున్నానంటే నాకంటే సమంత బాగా టెన్షన్‌ పడిపోయింది. తనకే ఫస్ట్‌ సినిమా చూపించాను. తనకీ, చైతన్యకి సినిమా నచ్చింది. ‘నాన్నని కూడా చూడమని చెబుతాను’ అని చైతన్య అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత నాగ్‌సార్‌ కూడా చూసి చాలా ఎంజాయ్‌ చేసి, రిలీజ్‌ చేయడానికి రెడీ అయ్యారు. సినిమా చూసి వెళ్లిపోయేప్పుడు ‘నీకు మంచి ఫ్యూచర్‌ ఉంది నాన్న’’ అన్నారు. ఆ కాంప్లిమెంట్‌ నాకు ఆస్కార్‌ సాధించినట్టు అనిపించింది.

► హీరోయిన్‌ పాత్రకు నా భార్య చిన్మయి డబ్బింగ్‌ చెప్పింది. తనకు సినిమా బాగా నచ్చింది. మా పెళ్లి కాకముందే ఈ కథ రాసుకున్నాను. మా పర్సనల్‌ లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏమీ లేవు.

► మ్యూజిక్‌ ప్రశాంత్‌ విహారి, కెమెర సుకుమారన్‌ సార్‌ నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకువెళ్లారు. ప్రొడ్యూసర్‌ బాగా సపోర్ట్‌ చేశారు.

► ఆగస్ట్‌ 3న నా సినిమా శేష్‌ ‘గూఢచారి’ రిలీజ్‌ అవుతున్నాయి. ‘నా సినిమాని నువ్వు, నీ సినిమాను నేను ప్రమోట్‌ చేసుకుందాం’ అని శేష్‌తో అన్నా. నెక్ట్స్‌ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్‌లోనే. హీరోగా ‘దృష్టి’, ‘యు టర్న్‌’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు