ఆస్కార్‌కు మన కోర్ట్

24 Sep, 2015 01:36 IST|Sakshi
ఆస్కార్‌కు మన కోర్ట్

 భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కు ఏ సినిమా నామినేటవుతుంది? ఈ ఉత్కంఠకు బుధవారం తెరపడింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం నుంచి మరాఠీ చిత్రం ‘కోర్ట్’ను ‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఐ) నామినేట్ చేసింది. నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ నేతృత్వంలోని పదిహేడు మంది సభ్యులతో కూడిన జ్యూరీ దేశంలో వివిధ భాషల్లో రూపొందిన 30 చిత్రాలను వీక్షించింది. వీటిలో తెలుగు నుంచి ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’, హిందీ నుంచి ‘పీకే’, ‘అగ్లీ’, ‘హైదర్’, ‘మేరీ కోమ్’, తమిళం నుంచి ‘కాక్కా ముట్టయ్’ తదితర  చిత్రాలున్నాయి. అన్ని చిత్రాలనూ వీక్షించిన అనంతరం మరాఠీ ‘కోర్ట్’ను ఎంపిక చేసింది.

‘‘భారతీయ న్యాయవ్యవస్థను ఈ చిత్రం కళ్లకు కట్టింది. అందుకే మన దేశం పక్షాన ఈ చిత్రాన్ని ఎంపిక చేశాం’’ అని బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అమోల్ పాలేకర్, ఎఫ్‌ఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్ సుప్రాణ్ సేన్ తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత సి. కల్యాణ్ కూడా పాల్గొన్నారు. వృద్ధ జానపద కళాకారుడి కథతో... జానపద గీతాల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసే ఓ వృద్ధ సామాజిక కార్యకర్త కథ - ‘కోర్ట్’. ఈ పాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణతో ఆ సామాజిక కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేస్తారు.

 ఈ కేసు నేపథ్యంలో ‘కోర్ట్’ సాగుతుంది. దర్శకుడు చైతన్యా తమ్హాణెకు ఇది తొలి చిత్రమైనప్పటికీ, ఇప్పటికే ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సత్తా చాటుకుంది. మరి, వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఫైనల్‌గా పోటీపడే 5 చిత్రాల్లో మన ‘కోర్ట్’ నామినేషన్ దక్కించుకుంటుందో లేదో? ఒకవేళ నామినేషన్ దక్కితే, ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుని తన సత్తా చాటుతుందో లేదో చూడాలి.
 

>