వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి

19 Mar, 2019 13:03 IST|Sakshi
నటి రాయ్‌లక్ష్మీ

సినిమా: వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి అంటోంది నటి రాయ్‌లక్ష్మీ. అందాల ఆరబోతకు కేరాఫ్‌గా మారిన హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా పలు వివాదాలకు, సంచలనాలకు ఈమె కేంద్ర బిందువే. కాగా ఆ మద్య దక్షిణాదిని వదులుకుని బాలీవుడ్‌ ఆశతో ముంబాయికి మకాం మార్చింది రాయ్‌లక్ష్మీ. అక్కడ జూలీ–2 చిత్రంలో మోతాదుకు మించిన గ్లామర్‌ను ప్రదర్శించి సెటిల్‌ అవ్వాలని ఆశ పడింది. అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటారే.. అలాంటి పరిస్థితే రాయ్‌లక్ష్మీకి ఎదురైంది. దీంతో గోడకు కొట్టిన బంతిలా మళ్లీ దక్షిణాదికి తిరిగివచ్చింది. అందుకు తగ్గట్టుగా కోలివుడ్‌లో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో చేతిలో చిత్రాలు ఉన్నాయి. ఈ అమ్మడు నటించిన పొట్టు చిత్రం ఇటీవలే విడుదలైంది. తాజాగా నీయా–2 చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా రాయ్‌లక్ష్మీతో చిట్‌చాట్‌.

ప్ర: నీయా–2  ఏ తరహా చిత్రం?
జ: ఇది పాము కథ నేపథ్యంగా సాగే చిత్రం. నా పాత్రకు కూడా పాముతో సంబంధం ఉంటుంది. ఇందులో నేను రెండు గెటప్‌లలో కనిపిస్తాను. సస్పెన్స్‌ కథాంశంతో కూడిన ఈ చిత్రం మూడు కాలాలకు చెందినదిగా ఉంటుంది. అందుకే ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ముగ్గురికీ తగిన ప్రాధాన్యత ఉంటుంది. సినిమా షూటింగ్‌ మొత్తం చాలా జాలీగా గడిచిపోయింది.

ప్ర: కోలీవుడ్‌లో చాలా గ్యాప్‌ వచ్చినట్టుంది?
జ: నిజం చెప్పాలంటే ఒకేసారి ఐదారు చిత్రాల్లో నటించాలన్న ఆశ నాకు లేదు. ఏదైనా కొత్తగా చెయ్యాలని ఆశ పడుతుంటాను. అందుకే చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. సరైన అవకాశాలు రాకుంటే ఖాళీగా ఉండటమే బెటర్‌.

ప్ర:చాలా స్లిమ్‌గా తయారయ్యారు, ఎంత బరువు తగ్గారు?
జ: కొందరు బరువు తగ్గితే చూడలేం. ఈ విషయాన్ని నేనే కొందరితో అన్నాను. నేను సన్నబడ్డ కూడా బాగున్నావంటున్నారు. నీయా–2 చిత్రంలో నా పాత అవతారాన్ని, స్లిమ్‌గా మారిన అవతారాన్ని చూడవచ్చు. ఈ చిత్రం కోసం సుమారు 15 కిలోల బరువు తగ్గాను.

ప్ర: ఎక్కువగా బికినీ దుస్తుల్లో అదీ కూడా సెల్ఫీ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. కారణం ఏమిటీ?
జ: నేను ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ తీసుకుంటాను. అదంతా జ్ఞాపకాల కోసమే. అంతే కానీ సామాజిక మాద్యమాల్లో పోస్ట్‌ చేయడానికి మాత్రం కాదు. నేను చాలా కాలం ముంబాయిలో ఉన్నాను. అక్కడ బికినీ ధరించడం సర్వసాధారణం. అది నాకూ నచ్చింది. అందుకే బికినీ దుస్తులు ధరించి ఫొటోలు దిగాను. అలాంటి గ్లామర్‌ ఫొటోలను చూడటానికి ఇష్టపడని వారు కళ్లు మూసుకుని కూర్చోవచ్చు.

ప్ర:వివాహం ఎప్పుడు చేసుకుంటారు?
జ: నాకు కాబోయే భర్తను నేనే ఎంపిక చేసుకోవాలి. ఆ స్వేచ్ఛని నా కుటుంబ సభ్యులు ఇచ్చారు.

ప్ర: ప్రేమ అనుభవాలు?
జ: అవి లెక్కలేనన్ని. పాఠశాలలోనే చాలా మంది ఉన్నారు. వారి సంఖ్య చెప్పాలంటే వేరే లెవల్‌.

ప్ర: రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే?
జ: ఇప్పటికే చాలా మంది ఆహ్వానించారు. నేనే నిరాకరించాను.

ప్ర: మీటూ ఉద్యమం గురించి మీ అభిప్రాయం?
జ: మీటూపై పోరాడటం మంచి విషయం. పలువురు బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నారు. అయితే కొందరు దీన్ని మరోరకంగా వాడుకుంటున్నారు అది తప్పు.

మరిన్ని వార్తలు