ఎమ్మెల్యే కావాలని ఉంది: డైరెక్టర్‌

9 Jan, 2018 15:44 IST|Sakshi

సాక్షి, చెన్నై: దర్శకుడు పేరరసు ఎమ్మెల్యే కావాలని ఆశ పడుతున్నారట. కళాకారులను ప్రోత్సహించే విధంగా 2017 రైజింగ్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇటీవల స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది. భాస్కర్‌ మీడియా, ఆర్‌కేవీ ఫిలింఇన్‌స్టిట్యూట్, ఇండియన్‌ క్లాసిక్‌ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్, ఆరోగ్య ఇనిప్పు తులసీ చారు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, ఆర్‌వీ.ఉదయకుమార్, జాగ్వర్‌తంగం, పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2017లో విడుదలైన చిత్రాల్లో ఉత్తమ పరిచయ కథానాయకుడి అవార్డును నందన్‌ (పళ్లిపరువత్తిలే), ఉత్తమ పరిచయ కథానాయకి అవార్డును అతిథిబాలన్‌ (అరువి), ఉత్తమ పరిచయ దర్శకుడు – అరుణ్‌ప్రభు పురుషోత్తమన్‌ (అరువి), ఉత్తమ ప్రతినాయకుడు –డేనియల్‌ బాలాజీ (ఇప్పడై వెల్లుమ్‌), ఉత్తమ కథారచయిత – గోపీనైనార్‌ (అరమ్‌), ఉత్తమ దర్శకుడు – జిప్సీరాజ్‌కుమార్‌ (అయ్యనార్‌ వీధి) ఉత్తమ సంగీతదర్శకుడు–శ్యామ్‌ సీఎస్‌ (ఇరుదుచుట్రు) అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ 2017లో చిన్నచిత్రాలే పెద్ద విజయాలను సాధించాయన్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం అని పేర్కొన్నారు. రైజింగ్‌ స్టార్‌ అవార్డులను అందుకున్న కళాకారులందరికీ అభినందలు తెలుపుతున్నానన్నారు. ఈ రోజుల్లో దర్శకత్వం కంటే నటనే బెటర్‌ అనిపిస్తోందన్నారు. దర్శకత్వంతో గౌరవం లభించడం లేదన్నారు. ఇకపై తానూ నటనపై దృష్టి సారించాలనుకుంటున్నానని అన్నారు. తద్వారా కనీసం ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నానని దర్శకుడు పేరరసు ఈ సందర్భంగా అన్నారు. 

మరిన్ని వార్తలు