మా ఆయుధం స్వార్థత్యాగం

28 Aug, 2019 06:47 IST|Sakshi
రైతుబిడ్డ పోస్టర్‌ ,టంగుటూరి సూర్యకుమారి

రైతుబిడ్డకు 80 ఏళ్లు

రైతు ఔన్నత్యాన్ని ఎనిమిది దశాబ్దాల కిందటే ‘నిద్ర మేలుకోరా తమ్ముడా, గాఢ నిద్రమేలుకోరా తమ్ముడా / నిద్రమేల్కొని భద్రపడరా జమీందారీ రైతు తమ్ముడా / రాజ్యమునకు రైతు గుండెరా’ అంటూ తమ కలాలతో పొలాలు దున్నారు ‘రైతుబిడ్డ’ గీత రచయితలు, ప్రకృతిని ప్రేమించమన్నారు ‘రైతుబిడ్డ’ కథా రచయిత గూడవల్లి రామబ్రహ్మం. శంభుని శిరంబున గంగ అన్నట్లుగా రైతును శిరసుకి ఎత్తుకున్నారు మాటల రచయిత గోపీచంద్‌. ‘పంటబోయినా పన్నుల తెమ్మని బాధలుపెట్టెదరేలా’ అంటూ బైరాగి పాడారు. నాటి కథాంశం నేటికీ పరిష్కరించవలసిన సామాజికాంశం కావడమే విశేషం.
జమీందారుల వల్ల కష్టపడుతున్న రైతులను దగ్గరగా చూశారు గూడవల్లి. తనలోని జీవుని వేదనను ‘రైతుబిడ్డ’గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. నాగాపురం గ్రామంలో జరిగిన కథ ఇది. ఆ గ్రామంలో రెండు వర్గాలు ఉన్నాయి. జమీందార్లు, రైతులు. ఎన్నికల సమయంలో రామిరెడ్డి రైతుల పక్షాన, వెంకయ్య జమీందారు పక్షాన పోటీ చేస్తారు. ఆ సమయంలోనే జమీందారు వర్గం రైతులను హింసిస్తుంది. మొత్తమ్మీద రైతు నాయకుడు విజయం సాధిస్తాడు. స్థూలంగా ఇదీ కథ.

1939 ఆగస్టులో విడుదలై, నాటి బ్రిటిషు ప్రభుత్వ నిషేధానికి గురైన చిత్రం ‘రైతుబిడ్డ’. ఈ చిత్రంలోని దార్శనికతను జమీందారీ వర్గం వ్యతిరేకించింది. కొందరు జమీందారులు కొన్ని ఫిల్ములను తగులబెట్టేశారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక 1948లో విడుదలై, ప్రజాభిమానం చూరగొంది.

నాటి నుంచి నేటి వరకు
‘ఓటులిమ్మని కోటకు రమ్మని ఒత్తిడి చేయగనేలా’ అని ఆనాటి సామాజిక సత్యాన్ని రైతుబిడ్డలోని ఒక పాటలో చూపారు. ‘‘ఏనాడు జమీందారు భూదేవిని ఆక్రమించుకుని భుక్తం చేసుకోవడానికి ప్రయత్నించాడో... ఏనాడు మనం నిర్వీర్యులమై గుటకలు మింగడానికి ప్రారంభించామో, ఆనాడే  రైతుజీవితం దుస్సహమైపోయింది’’ అనే డైలాగులు ఉన్నాయి. ‘‘రైతే భారతదేశానికి వెన్నెముక. రైతు నాగలి ఎత్తకపోతే ప్రపంచం మలమల మాడిపోతుంది. రైతు ముల్లుకర్ర పట్టకపోతే దేశం అల్లాడిపోతుంది’’ అనే మాటలు నేటికీ అక్షర సత్యమే.
ఎనభై ఏళ్ల క్రితమే ఆంగ్లేయుల ప్రభావం మన మీద పడింది. దొరల్లా కుక్కలను పెంచుకోవడం, వాటితో ఇంగ్లీషులో మాట్లాడుకోవడం వంటి లక్షణాలు దిగుమతి చేసుకున్నాం. ‘‘కనకం, కనకమంటే మాటే గానండీ, కుండలే భాండాలండీ’’, ‘‘భాషన్నప్పుడు ఇంగ్లీషు భాషే భాషోయ్‌. గాడ్‌లోని జి ఓ డీని తిరగేస్తే, డి ఓ జీ డాగ్‌ అవుతుంది. కనకనే ఆరు సింహాసనమున ఉన్నారండీ...’’ అంటూ వ్యంగ్యాన్ని అనితర సాధ్యంగా సృష్టించారు మాటల రచయితలు.

ఎన్నని ఎన్నగలం!
ఎన్నికల్లో నిలబడితే ఖర్చు చేయడంలో పెద్ద తేడా లేదు. ఆ రోజుల్లోనే ‘ఎలక్షన్ల కోసం నాలుగు కార్లు, ఐదు వేల రూపాయలు’ ఖర్చు చేశారు. ‘మా రాజులుంగారి పార్టీ తరపున పని చేస్తావా లేదా’ అంటూ రాజుని రాజులుంగారు చేశారు త్రిపురనేని గోపీచంద్‌. రైతుబిడ్డ సంభాషణల రచయితల్లో ఆయన కూడా ఒకరు.  అక్కర్లేని చోట ఆంగ్లంలోని ఇంగ్‌ పదాన్ని చేర్చి, జమీందారుగారిని మీటింగ్‌ చేశానండీ... అలాగ డేరింగ్‌ చేయాలండీ... ఈ విషయంలో మీరు ట్రయింగ్‌ చేయాలండీ... అంటూ  గోపీచంద్‌ ప్రయోగం చేశారు. ‘వర్తమానో, భవిష్యత్తో, భూతకాలో..... త్రికాలో... రాజ్యభ్రష్టో, మత భ్రష్టో, కుల భ్రష్టో, పునఃపునః సర్వభ్రష్టో... అని సున్నితమైన హాస్యం ఉంది. ‘ఇన్నాళ్లూ నువ్వూరుకుంటే ఈ వడ్డీ ఊరుకుంటుందనుకుంటున్నావా’, ‘తప్పుడు లెక్కలు ఎగవెయ్యడం కాకపోతే దిగలాగడం’ ‘అవ్వ పేరు ముసలమ్మ’ ‘అంతా తగు మనుషులే’... ఎన్నని ఎన్నగలం ఈ పడికట్టు పదాలను... ఈ జీవన సత్యాలను.

పాటలలో కూడా ప్రత్యేకత
రావోయి వనమాలి బిరబిర తిప్పువారికి తిప్పలు బాపే పేదల పెన్నిధి రాట్నం, రైతు తల్లి రాట్న మాత, ‘తల్లి పొదుగులో మంగళ జ్యోతి, పాలు తాగే లేగదూడ, రైతు సంతతిని రాయిడి చేసి దయమాలిన ప్రభుతలు కాదే, ఆవు రాజ్యము రంకెలు వేసే, మేని చెమటలు కారిచివేసి ఊరునాడు పెంచు రైతు..  అంటూ ఒక పెద్ద పాటతో రైతు జీవనాన్ని మనసులోకి చొప్పించారు. రైతును జమీందారులు ఆ రోజుల్లో కట్టుబానిసల్లా చూశారు. ‘‘వ్యవసాయం రైతు పని. పరిపాలన రాజు పని. రాజుకి భూమిచ్చినా చెడుతుంది, రైతుకి పరిపాలన ఇచ్చినా చెడుతుంది’’ అంటూ మెట్టవేదాంతం పలుకుతాడు కరణం. ‘ఎంత పంట పండినా కడుపుకాలి చస్తున్నారు రైతులంతా’.. నేటికీ వర్తిస్తున్నదే. 

నూరేళ్ల పైమాటే!
ఎనభయ్యేళ్ల నాటి ‘రైతుబిడ్డ’ తొలినాళ్ల తెలుగు సినిమా అయినప్పటికీ, తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్ర నూరేళ్ల పైమాటే! తెలుగులో తొలి టాకీ ‘భక్తప్రహ్లాద’ (1931) కాగా, తొలి మూకీ (నిశ్శబ్ద చిత్రం) ‘భీష్మ ప్రతిజ్ఞ’ (1921). తెలుగు సినిమా పితామహుడిగా ప్రఖ్యాతి చెందిన రఘుపతి వెంకయ్య 1909 నుంచే తెలుగు సినిమాల కోసం పాటు పడ్డారు. ‘భీష్మ ప్రతిజ్ఞ’ ఆయన నిర్మించిందే.

వెరైటీగా టైటిల్స్‌: సారథి ఫిల్మ్స్‌ బ్యానర్‌ మీద విడుదలైన రైతు బిడ్డ చిత్రం ‘మా ఆయుధం స్వార్థత్యాగం’ అని పాంచజన్యం పూరించింది. ఈ చిత్ర కథ స్వాతంత్య్ర పూర్వపు కాలంలో జరిగింది. చిత్ర కథ, సినారియో గూడవల్లి రామబ్రహ్మం, సంభాషణలు త్రిపురనేని గోపీచంద్, సపోర్టెడ్‌ బై తాపీ ధర్మారావు నాయుడు, విశ్వనాథ, కవిరాజు. పాటలు తాపీ ధర్మారావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, లే ట్‌ బసవరాజు అప్పారావు, నెల్లూరు వెంకటరామా నాయుడు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి... ఇలా టైటిల్స్‌ వస్తాయి. చిత్రాన్ని  రైతుబంధు బి. మునిస్వామి నాయుడు (మద్రాసు మాజీ ముఖ్యమంత్రి) కి అంకితమిచ్చారు.

రైతు ఔన్నత్యం
‘పసుపు కుంకుమ పట్టుకుని గడపగడపకు వెళ్లి ఓట్లు సాధించాల్సిందే’ అని ఆడవారిలో చైతన్యం తీసుకువచ్చారు గూడవల్లి. ‘ఇంతవరకు మలినం కాకుండా ఉన్నది రైతు జాతి మాత్రమే’, ‘జమీందార్లు వస్తారు పోతారు. రైతు సంఘం మాత్రం ఈ దేశం ఉండేంతవరకు చావు లేనిది’, ‘రైతుకే ఓటివ్వవలెనన్నా నీ కష్టసుఖముల రైతు ప్రతినిధి తీర్చగలడన్నా’’ అని ఓటర్లను రైతు వైపుకి మళ్లించారు. ‘మనం రైతు బిడ్డలం, ఆడితప్పం. మన తిరుగులేని అహింసాత్మక అస్త్రాన్ని ప్రయోగిద్దాం’ ‘మా పోరాటం విషపూరితం కాదు, ప్రేమపూరితం’ ‘మేం ఒక ఆదర్శం కోసం, ప్రజల సుఖం కోసం పోరాడుతున్నాం’ అని రైతులలోని చైతన్యాన్ని స్వచ్ఛమైన వారి నిజాయితీని ప్రేక్షకుల కళ్ల ముందుంచారు.

రైతుల డిమాండ్‌లకు కూడా శక్తిమంతంగా పలికించారు. లంచగొండితనాన్ని రూపుమాపాలి, వెట్టిచాకిరీ రద్దుపరచాలి, నిరక్షరాస్యతను నిర్మూలించాలి. బంజరు భూములు రైతులకే వదలాలి, ఉమ్మడి భూములు రైతులకే వదలాలి. అడవులను కూడా రైతులకే వదలాలి. నజరానాలకు స్వస్తి చెప్పాలి. బకాయి శిస్తులను రద్దుచేయాలి...’ అంటూ పదిహేను డిమాండ్లు అడిగించారు రైతుల నోటి ద్వారా. అక్కడితో సినిమా శుభం పలుకుతుంది – వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు