లిప్‌లాక్‌లు సక్సెస్‌ ఇవ్వవు

28 Jan, 2020 03:16 IST|Sakshi
రాజ్‌ కందుకూరి

‘‘పెళ్లి చూపులు, మెంటల్‌ మదిలో’ సినిమాల తర్వాత వెంటనే సినిమా ఎందుకు చేయలేదని చాలా మంది అడిగారు. వరుసగా సినిమాలు చేసేయాలని అనుకోవడం లేదు. సినిమాల సంఖ్య కంటే క్వాలిటీ ముఖ్యం అని నమ్ముతాను’’ అన్నారు నిర్మాత రాజ్‌ కందుకూరి. తన కుమారుడు శివ కందుకూరిని పరిచయం చేస్తూ రాజ్‌ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్‌ కందుకూరి చెప్పిన విశేషాలు.

► మన దగ్గర లేడీ డైరెక్టర్స్‌ సంఖ్య చాలా తక్కువ. లేడీ డైరెక్టర్‌ని పరిచయం చేయాలనుకున్నాను. శేష సింధు చెప్పిన కథ నచ్చింది. కానీ నిన్ను నమ్మి సినిమా ఎలా ఇవ్వాలని అడిగాను. ఐదు నిమిషాల వీడియో షూట్‌ చేసి చూపించింది. నమ్మకం వచ్చింది.

► ఈ సినిమాకు కొత్తవాళ్లే కావాలని అడిగింది సింధు. చాలా మందిని ఆడిషన్‌ చేసింది. అప్పుడే మా అబ్బాయి ఇండియా వచ్చాడు. తనని సుమారు 12 రోజులు ఆడిషన్‌ చేసి హీరోగా తీసుకుంది.  మా అబ్బాయి సినిమా అని స్పెషల్‌గా ఏం చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాం. ఈ సినిమా పూర్తికాకముందే మా అబ్బాయికి 3 సినిమా అవకాశాలు వచ్చాయి. రెండో సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేశాడు.

► మా బ్యానర్‌లో వచ్చే సినిమాల్లో అశ్లీలత, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉండవు. నా సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలు బలంగా ఉండాలనుకుంటాను. ఈ సినిమా నిడివి గంటా 54 నిమిషాలే. నిర్మాతగా మంచి సినిమానే తీశాను అనుకుంటున్నాను. నేను అనుకున్నదానికంటే బాగా చేశాడు మా అబ్బాయి శివ.

► సరైన సినిమా తీయడానికి 50 కోట్లు అక్కర్లేదు. 3 కోట్లు చాలు.  50 కోట్ల సినిమా తీయడం కంటే చిన్న బడ్జెట్‌ సినిమాలు తీయడమే ఎక్కువ రిస్క్‌. ఆ రిస్క్‌ అంటే నాకు ఇష్టం. ఈ మధ్య లిప్‌లాక్స్‌ సన్నివేశాలు ఉంటేనే సినిమా హిట్‌ అవుతుంది అనుకుంటున్నారు. లిప్‌లాక్‌ çసన్నివేశాలు సక్సెస్‌ ఇవ్వవు.

మరిన్ని వార్తలు