బాహుబలిని కట్టప్ప అందుకే చంపాడు..!

1 Apr, 2016 13:44 IST|Sakshi
బాహుబలిని కట్టప్ప అందుకే చంపాడు..!

తెలుగు సినిమా స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన బాహుబలి జాతీయ అవార్డు సాధించటంపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తన ఆనందాన్ని పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో 'బాహుబలి ద బిగినింగ్' సినిమా సమయంలో ఎదురైన కష్టనష్టాలతో పాటు, సినిమాలో తనకు నచ్చిన సన్నివేశాలు, పాత్రలు, టెక్నీషియన్స్ గురించి కూడా వివరించాడు.

బాహుబలి సినిమా మొదట్లో రమ్యకృష్ణ చిన్న పిల్లాడిని నీటిలో మునిగిపోకుండా పైకెత్తే సీన్ తనకు అన్నింటికన్నా బాగా నచ్చిన సీన్ అని చెప్పిన జక్కన్న, ప్రభాస్ తమన్నా కోసం కొండ ఎక్కే సన్నివేశాన్ని ఎంతో కష్టపడి తెరకెక్కించామని చెప్పాడు. ఈ సీన్స్ తీయడానికి ముందు ప్రభాస్ భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుని ఉండటంతో చాలా జాగ్రత్తగా షూట్ చేయాల్సి వచ్చిందన్నాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు మాత్రం.. నేను చెప్పాను కాబట్టే చంపాడంటూ చమత్కరించారు.

బాహుబలి షూటింగ్ సమయం ప్రతీరోజూ ఓ మంచి జ్ఞాపకం అన్న రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ శ్రమని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టాన్ని మాటల్లో చెప్పలేనన్న జక్కన్న, ఆయన.. కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు చేసే పనులు కూడా చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఎక్కువ రోజుల పాటు షూటింగ్ కొనసాగటంతో యూనిట్ సభ్యులంతా నిరుత్సాహానికి గురయ్యారని, 380 రోజుల పాటు షూటింగ్  చేయటమే అతి పెద్ద సవాల్ అనిపించిందని చెప్పారు.

బాహుబలి రెండో భాగం మరింత భారీగా తెరకెక్కుతోందని, ఆ సినిమా ప్రేక్షకుల ఊహకందని స్థాయిలో ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రెండో భాగంలో భావోద్వేగాలు, సన్నివేశాలు అందరినీ కట్టిపడేస్తాయన్నారు. తొలి భాగంలో కనిపించిన స్థాయి పోరాట సన్నివేశాలు కూడా రెండో భాగంలో కనువిందు చేయనున్నాయని తెలిపారు రాజమౌళి.