వెనక్కి వెళతారా?

1 Nov, 2018 01:05 IST|Sakshi
రాజమౌళి,రామ్‌చరణ్‌, ఎన్టీఆర్

రాజమౌళి మళ్లీ వెనక్కి వెళుతున్నారు. అంటే.. ‘మగధీర’ కోసం 400  ఏళ్లు వెనక్కి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘బాహుబలి’ కోసం రాజుల కాలానికి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ ఆయన వెనక్కి వెళ్లనున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించబోయేది  పీరియాడికల్‌ మూవీ (‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనేది వర్కింగ్‌ టైటిల్‌) అని సమాచారం.  ఈ భారీ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తారు. ఈ చిత్రం విశేషాలకు వస్తే... ఈ సినిమా స్వాతంత్య్రం రాక ముందు టైమ్‌లో జరిగే కథ అని సమాచారం.

ఈ పీరియాడికల్‌ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దరూ మునుపు ఎన్నడూ కనిపించని గెటప్స్‌లో కనిపిస్తారట. ఆల్రెడీ ఎన్టీఆర్‌ ఆ పాత్రకు సంబంధించిన శిక్షణ మొదలుపెట్టారు కూడా. రామ్‌చరణ్, బోయపాటి చిత్రంతో బిజీగా ఉన్నారు. దాన్ని పూర్తి చేసిన వెంటనే ఇందులో జాయిన్‌ అయిపోతారట. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 18న స్టార్ట్‌ కానుందని టాక్‌. ఈ పీరియాడికల్‌ కథకు కావల్సిన భారీ సెట్‌ను హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లో వేయిస్తున్నారని సమాచారం. మరోవైపు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా ముమ్మరంగా సాగుతున్నాయట.

రాజమౌళి గత చిత్రాలకు చేసినట్టే చిత్రం ప్రారంభోత్సవం రోజునే ఈ చిత్ర కథను చెబుతారా? లేక సస్పెన్స్‌గా ఉంచుతారా? వేచి చూడాలి.  ఒకవేళ సస్పెన్‌గా ఉంచదలిస్తే గాసిప్‌రాయుళ్ల ఊహాజనిత స్టోరీలు రోజుకొకటి వినొచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల సరసన హీరోయిన్లు ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ ఉండే వీలుందని టాక్‌. అందులో ముఖ్యంగా సమంత, కీర్తీ సురేశ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. 2020లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్‌ కుమార్, సంగీతం: కీరవాణి.

సంక్రాంతికే వస్తున్నాం
రామ్‌చరణ్‌–బోయపాటి శీను చిత్రం వాయిదా పడిందని పలు వార్తలు వచ్చాయి. వాటిని కొట్టిపారేస్తూ అధికారికంగా ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసింది చిత్రబృందం. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌  ‘వినయ విధేయ రామ’ (టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు) నిర్మాత దానయ్య మాట్లాడుతూ–  ‘‘మా చిత్రాన్ని రామ్‌చరణ్‌ అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా నిర్మిస్తున్నాం. చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. నవంబర్‌ 10 నాటికి రెండు పాటలు మినహా షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. నవంబర్‌ 9 నుంచే డబ్బింగ్‌ పనులు కూడా ప్రారంభిస్తాం. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసి, 2019 సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు