ద మాసివ్‌ మల్టీస్టారర్‌.. ఊగిపోతున్న ఫ్యాన్స్‌!

22 Mar, 2018 20:04 IST|Sakshi

ఎస్‌ఎస్‌ రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌.. ఈ ముగ్గురు ఎవరికి వారు సూపర్‌స్టార్లు. వీరి సినిమాలు సోలోగానే బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించాయి. మరి ఈ ముగ్గురు ఒకే గొడుగు కిందకు వచ్చి.. ఒకే సినిమాతో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్ధమైతే.. అదే ద మాసివ్‌ మల్టీస్టారర్‌.. ట్రిపుల్‌ ఆర్‌.. టాలీవుడ్‌ టైటన్స్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి అఫీషియల్‌గా ప్రకటిస్తూ.. ఆర్‌ త్రయం హ్యాష్‌ట్యాగ్‌ను విడుదల చేసింది రాజమౌళి టీం. ప్రస్తుత తరానికి టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ.. యావత్‌ భారతదేశంలోనూ అతిపెద్ద మల్టీస్టారర్‌ సినిమా ఇదేనేమో అంటూ.. ఈ చిత్రం గురించి ఇలా అధికారిక ప్రకటన వెలువడగానే.. అలా సోషల్‌ మీడియా పోటెత్తింది. ట్విట్టర్‌ ఊగిపోతోంది. ట్రిపుల్‌ ఆర్‌ యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విట్టర్‌లో, సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

భారతదేశమే కాదు యావత్‌ ప్రపంచం టాలీవుడ్‌ వైపు తలతిప్పి చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... భారతీయ చిత్రసీమ గర్వపడేలా చేసింది. యావత్‌ ప్రపంచం అబ్బురపడింది. సినీ జనాలు కొన్నాళ్లపాటు ‘బాహుబలి’ మానియాతో ఊగిపోయారు. ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని టాలీవుడ్‌ నుంచి వచ్చిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టింది. దేశంలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాల జాబితాలో ముందువరుసలో నిలిచింది. ఒక అద్భుతమైన సినిమాగా, ఒక దృశ్యకావ్యంగా నిలిచిపోయిన ‘బాహుబలి’ తర్వాత.. దర్శకుడు రాజమౌళి ఏ సినిమా తీస్తాడన్నది సర్వత్రా ఆసక్తి రేపింది.

అటు జూనియర్‌ ఎన్టీఆర్‌ వరుస విజయాలతో మంచి ఊపు మీదు ఉన్నాడు. టెంపర్‌ సినిమా నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌, జైలవకుశ.. అన్ని విభిన్నమైన సినిమాలే. జైలవకుశలో త్రిపాత్రాభినయంతో తారక్‌ అదరగొట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇటు మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ కూడా మంచి ఊపుమీద ఉన్నాడు. చరణ్‌ నటించిన ‘ధ్రువ’ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమాలో చరణ్‌ తన యాక్టింగ్‌తో మెప్పించాడు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌, పాటలు విశేష ఆదరణను పొందాయి.

ఇలా ముగ్గురికి ముగ్గురు హై సక్సెస్‌ఫుల్‌ ట్రాక్‌లో ఉన్న సమయంలో రాజమౌళి.. తారక్‌, చరణ్‌తో భారీ మల్టీస్టారర్‌ సినిమా చేయబోతున్నాడన్న వార్త బయటకు వచ్చింది. దీని గురించి అధికారిక ప్రకటనలేవీ లేకపోయినా.. టాలీవుడ్‌లో క్రమంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు.. ఈ సినిమా కోసం తారక్‌, చరణ్‌ అమెరికా వెళ్లి ఫొటోషూట్‌లో పాల్గొనడం.. అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఈ కథనాలు నిజం చేస్తూ.. ఆర్‌ త్రయం కాంబినేషన్‌లో మాసివ్‌ మల్టీస్టారర్‌ మూవీ రానుందని,  డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. అటు నందమూరి, మెగా అభిమానులు.. ఇటు రాజమౌళి ఫ్యాన్స్‌లో ఈ అనౌన్స్‌మెంట్‌తో ఉత్సాహం పెల్లుబుక్కుతోంది. సినిమా ఎలా ఉండబోతోంది? రాజమౌళి ఏ మాయాజాలాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాడు? ఈ మల్టీ స్టారర్‌లో మా హీరోకు తగినంత ప్రాధాన్యం ఉంటుందా? తరహాలో మెగా, నందమూరి అభిమానుల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ట్రిపుల్‌ ఆర్‌ యాష్‌ట్యాగ్ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా