టిప్పు సుల్తాన్గా రజనీకాంత్

10 Sep, 2015 13:56 IST|Sakshi

బాహుబలి సినిమా తరువాత దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ భారీ బడ్జెట్ సినిమాల హవా మొదలైంది. ముఖ్యంగా మార్కెంటింగ్ పరంగా ప్రాంతీయ సినిమా స్థాయి పెరగటంతో వందకోట్ల కలెక్షన్లు వసూళు చేయగలిగిన స్టార్ హీరోల పై దృష్టిపెడుతున్నారు బడా నిర్మాతలు. అందులో భాగంగా కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త అయిన అశోక్ కెని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ఓ భారీ హిస్టారికల్ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు.

మైసూర్ మహా రాజు టిప్పు సుల్తాన్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు అశోక్.. ఈ సినిమాలో రజనీ లాంటి స్ట్రాంగ్ మార్కెట్ స్టామినా ఉన్న నటుడు టిప్పుసుల్తాన్గా నటిస్తే బడ్జెట్ పరంగా ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నాడు. గతంలో ఈ విషయం పై రజనీని సంప్రదించే ప్రయత్నం చేసినా అప్పట్లో, రజనీ ఆరోగ్య సమస్యల కారణంగా సాధ్యం కాలేదు. ప్రస్తుతం రజనీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు కనుక మరోసారి ప్రయత్నాలు ప్రారంభిచాడు అశోక్.

ఇప్పటికే లోకనాయకుడు కమల్ హాసన్ కూడా టిప్పుసుల్తాన్ జీవిత కథ ఆధారంగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. మరి ఈ నేపథ్యంలో రజనీ కాంత్ ఈ సినిమా అంగీకరిస్తాడా, లేక కమల్ హాసన్ కే టిప్పు సుల్తాన్ కథను వదిలిపెడతాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం  రంజిత్ దర్శకత్వంలో కబాలీ షూటింగ్ లోపాల్గొంటున్న రజనీ కాంత్ ఆసినిమా తరువాత శంకర్ డైరెక్షన్ లో రోబో 2లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుంది.అంటే రజనీ టిప్పు సుల్తాన్ కథను అంగీకరించినా, ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే అవకాశం అయితే లేదు.