సూపర్‌ మజా

15 Sep, 2018 00:20 IST|Sakshi
రజనీకాంత్‌

మా సినిమాలో మ్యాటర్‌ ఇది. విజువల్‌గా ఇలా ఉండబోతోంది, ఇలాంటి సీన్స్‌ ఉండబోతాయి అని ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులను టీజర్‌ ద్వారా టీజ్‌ చేస్తుంటారు చిత్రబృందం. రోట్లో నూరుతున్న పచ్చడి రుచి ఎలా ఉండబోతోందో అని అమ్మమ్మ చూపించే శాంపిల్‌లా. అయితే ఆ టీజర్‌ మీద అంచనాలు అధికమైనప్పుడే అసలు తంటాలు ఏర్పడుతుంటాయి. రజనీకాంత్‌ లేటెస్ట్‌ భారీ బడ్జెట్‌ చిత్రం ‘2.ఒ’ కూడా అలాంటి చిరు నిరుత్సాహమే ఏర్పరిచిందని కొందరు అంటున్నారు.  రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘2.ఒ’. అమీ జాక్సన్‌ కథానాయిక.

అక్షయ్‌ కుమార్‌ విలన్‌. 2010లో రిలీజ్‌ అయిన ‘రోబో’ సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమా రిలీజ్‌ పలు వాయిదాలు పడుతూ వస్తోంది. కారణం వీఎఫ్‌ఎక్స్‌. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు. వినాయక చవితి సందర్భంగా టీజర్‌ రిలీజ్‌ చేశారు. అంచనాలు భారీగా ఉండటంతో ఇంకా ఏదో ఎదురు చూశారు. త్రీడీ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని తీశారు. ట్రైలర్‌ను కూడా ఆ ఫార్మాట్‌లోనే కొన్ని థియేటర్స్‌లో రిలీజ్‌ చేశారు. బిగ్‌ స్క్రీన్‌ మీద చూసిన కొందరు అద్భుతం అంటుంటే.. యూట్యూబ్‌లో వీక్షించిన వారిలో కొందరు ఆశించినంత లేదంటున్నారు. కానీ 3డీని చిన్న స్క్రీన్స్‌లో (మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌)లో చూస్తే ఏముంటుంది మజా? 3డీ స్క్రీన్‌లో చూస్తేనే కదా సూపర్‌ మజా అంటున్నారు రజనీ అభిమానులు. పాయింటే కదా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు