శ్రీహరిగారి పేరు నిలబెడతాడు

2 Jul, 2019 02:51 IST|Sakshi
సత్యనారాయణ, తలసాని సాయి, శాంతిశ్రీహరి, నక్షత్ర, మేఘాంశ్‌...

– శాంతిశ్రీహరి

‘‘మేఘాంశ్‌ తొలి సినిమా ‘భైరవ’ (బాల నటుడు). ‘రాజ్‌ధూత్‌’ రెండవ (హీరో) చిత్రం. పాఠాలు సరిగ్గా చదవడు కానీ, డైలాగులున్న పేజీలు మాత్రం బాగా చదువుతాడు. మేఘాంశ్‌ రక్తంలోనే నటన ఉందని అప్పుడే అర్థమైంది. ‘రాజ్‌ధూత్‌’ ట్రైలర్‌ చూసిన తర్వాత శ్రీహరిగారి పేరును మేఘాంశ్‌ నిలబెడతాడన్న నమ్మకం వచ్చింది’’ అని దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి శాంతి అన్నారు. శాంతిశ్రీహరి  తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘రాజ్‌ధూత్‌’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు.

అర్జున్‌–కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం మా బావ (శ్రీహరి). మా ఇద్దరిదీ 35 ఏళ్ల అనుబంధం. నాకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది ఆయనే. దాని పేరు శ్రీహరి నిలయం. తండ్రిలా మేఘాంశ్‌ పెద్ద స్టార్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘మా దర్శకులు ఇద్దరైనా ఒక్కరిలా పనిచేసి, చాలా క్లారిటీతో ఈ సినిమా తీశారు.

పైరసీని ఎంకరేజ్‌ చేయకుండా థియేటర్‌లో సినిమా చూడండి’’ అని మేఘాంశ్‌ అన్నారు. ‘‘నిర్మాతకు కథ చెప్పగానే మూడు రోజుల్లో ఓకే చేశారు. మేఘాంశ్‌ పెద్ద డైరెక్టర్స్‌తో సినిమాలు చేయొచ్చు.. కానీ మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చారు’’ అన్నారు అర్జున్‌–కార్తీక్‌. ‘‘శ్రీహరిగారి వల్ల ఎంతో మంది వివిధ రంగాల్లో సెటిల్‌ అయ్యారు. నేను ఇలా ఉండటానికి కారణం శ్రీహరిగారే. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’’ అన్నారు ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌. ‘‘నేను నిర్మాతగా ఉన్నానంటే కారణం శ్రీహరిగారే. ఆయన ఉండుంటే ఇంకా చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చేవారు.

ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప వ్యక్తి. మహాసముద్రంలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం’’ అన్నారు నిర్మాత బెల్లకొండ సురేష్‌. ‘‘రాజ్‌ధూత్‌’తో నేను గొప్ప నిర్మాత అవుతానో? లేదో? తెలియదు. కానీ అర్జున్‌–కార్తీక్‌ మంచి దర్శకులవుతారు. మేఘాంశ్‌ బాగా నటించాడు’’ అన్నారు చిత్రనిర్మాత సత్యనారాయణ. దర్శకులు ఇ.సత్తిబాబు, దేవీప్రసాద్, బాబీ, రవికుమార్‌ చౌదరి, శ్రీరామ్‌ ఆదిత్య, అజయ్‌ భూపతి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తనయుడు సాయి, నటుడు రాజా రవీందర్, నిర్మాత అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు