ఆ పాటల్లో నేనుండటం ఆనందం

12 Oct, 2018 06:10 IST|Sakshi
రాజేంద్రప్రసాద్‌

‘‘నా సినిమాల్లో మొదట్నుంచీ విలువలతో కూడిన హాస్యం, విలువలతో కూడిన కథలకే చోటు ఇచ్చా. 42ఏళ్లుగా ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో సంపాదించిన స్థానాన్ని కోల్పోలేదంటే కారణం అదే’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సంజోష్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రలో రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్‌’. కాసం సమర్పణలో పొన్నాల చందు, డా.ఎం.ఎస్‌. మూర్తి, ఎమ్‌. అరవింద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ పంచుకున్న చిత్ర విశేషాలు..

► నటీనటులు కాదు.. వారు చేసిన పాత్రలే ప్రేక్షకుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలా నా నట జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మరొక పాత్ర ‘బేవర్స్‌’ సినిమాలో చేశా. రమేష్‌ చెప్పాల ‘మీ శ్రేయోభిలాషి’తో రచయితగా నాకు పరిచయం. ‘ఆ నలుగురు’ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న నాకు అంతకంటే మంచి కథని ‘మీ శ్రేయోభిలాషి’కి ఇచ్చారు.

► సమాజంలో తండ్రి, పిల్లల మధ్య అనుబంధాన్ని ‘ఆ నలుగురు’లో చెప్పాం. ఆ బంధంలో మరో కోణాన్ని ఆవిష్కరిద్దాం అంటూ రమేష్‌ చెప్పాల ‘బేవర్స్‌’ కథ చెప్పాడు. తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతలేంటి? అనే విషయాలను వినోదాత్మకంగా చూపించాం. అందరికీ మా సినిమా నచ్చుతుంది.  – ఇటీవల రెండు అగ్రదేశాల్లో జీవిత సాఫల్య పురస్కారం అవార్డు అందుకున్నా. అక్కడికెళ్లినప్పుడు ‘అప్పుల అప్పారావు, దివాకరం’ అంటూ నా పాత్రల పేర్లతోనే ప్రేక్షకులు పలకరించడం చాలా సంతోషంగా అనిపించింది. బాధ్యత లేకుండా తిరిగేవాణì్న బేవర్స్‌ అంటారు. కుటుంబంలో ఎవరు బాధ్యత లేకుండా తిరిగినా బేవర్సే. సమాజం ఇలా ఉందని కాకుండా, ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాం.

►  కాలానికి అనుగుణంగా కథలు మారిపోతున్నాయి. ఓ సమకాలీన తండ్రి పాత్రని ‘బేవర్స్‌’లో చేశా. కూతురుకీ, తండ్రికీ... కొడుకుకీ, తల్లికీ మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అలా కూతురుని ప్రాణంగా ప్రేమించిన ఓ తండ్రి పాత్ర నాది. కొన్ని పాత్రలు నటుల్ని బాగా లీనం అయ్యేలా చేస్తుంటాయి. అదంతా కథ గొప్పతనమే.

► మనిషి జీవితంలో గుర్తుండిపోయేవి పెళ్లి, చావు. పెళ్లిలో నా ‘పెళ్లిపుస్తకం’ చిత్రంలోని ‘శ్రీరస్తు శుభమస్తు...’ పాట వస్తుంటుంది. ఆ పెళ్లిలో నేనున్నాననే అనుభూతి కలుగుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ‘ఆ నలుగురు’ సినిమాలోని ‘ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం’ అనే పాట వినిపిస్తుంటుంది. అలాగే తండ్రీకూతుళ్ల బంధం గురించి ‘బేవర్స్‌’లో ఓ పాట ఉంది. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఆ పాటని ఎ.ఆర్‌.రెహమాన్‌లా ఆలపించాడు సంగీత దర్శకుడు సునీల్‌కశ్యప్‌.  

► గతంతో పోలిస్తే చిన్న సినిమా విడుదల ఇప్పుడు చాలా సమస్యగా మారింది. అయితే మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. చిన్న సినిమా తీసేవాళ్లంతా చచ్చినట్టుగా మంచి సినిమానే తీయాలనే పరిస్థితి వచ్చింది. మేం కూడా ‘బేవర్స్‌’ అనే ఒక మంచి సినిమానే తీశాం. 

మరిన్ని వార్తలు