ఆ టైటిల్‌ ఎందుకంటే?

22 Sep, 2018 00:31 IST|Sakshi
సంజోష్, రాజేంద్రప్రసాద్‌

తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్‌ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్‌ అవుతారనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘బేవర్స్‌’. రాజేంద్రప్రసాద్‌ ముఖ్యపాత్రలో, సంజోష్, హర్షిత హీరోహీరోయిన్లుగా రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో కాసం సమర్పణలో పొన్నాల చందు, డా.ఎం.ఎస్‌.మూర్తి, ఎమ్‌. అరవింద్‌ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 5న విడుదల కానుంది. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి ‘బేవర్స్‌’ టైటిల్‌ ఏంటి? అని మొదట్లో అనిపించింది. ఇదే అనుమానం ప్రేక్షకులకి కూడా వస్తుంది. కానీ, ఆ టైటిల్‌ ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది.

సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్‌ హిట్‌ సినిమా చేశాననే తృప్తి ఉంది’’ అన్నారు. ‘‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా ఎంత తృప్తి చెందానో ‘బేవర్స్‌’ చిత్రం తెరకెక్కిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి పొందాను. రాజేంద్రప్రసాద్‌గారు ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయకపోవడం నా అదృష్టం’’ అన్నారు రమేష్‌ చెప్పాల. ‘‘ఎక్కడా రాజీ పడకుండా ‘బేవర్స్‌’ నిర్మించాం. సునీల్‌ కశ్యప్‌ మంచి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటకి చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. హీరో సంజోష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు