కేస్‌ లేదు బాస్‌!

10 Dec, 2017 02:44 IST|Sakshi

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. అమెరికన్‌ వీఎఫ్‌ఎక్స్‌ (విజువల్‌ ఎఫెక్ట్స్‌) కంపెనీ రజనీకాంత్‌ ‘2.0’ గ్రాఫిక్స్‌ పనులను తారుమారుగా చేసిందట. అందుకని ఈ చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఆ కంపెనీ మీద కేస్‌ పెట్టబోతోందట. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాకపోతే ఇక సినిమా ఏప్రిల్‌లో కూడా రావడం కష్టమేనట... శనివారం అటు చెన్నై కోడంబాక్కమ్‌ ఇటు హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో షికారు చేసిన వార్త ఇది. శంకర్‌ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘2.0’ విడుదల ఇప్పటికే పలు మార్లు వాయిదా పడటం, అభిమానులు నిరుత్సాహపడటం తెలిసిందే.

మళ్లీ వాయిదా అంటే.. ఈసారి అభిమానుల ఆవేదన ఆగ్రహంగా మారే ప్రమాదముంది. అందుకే లైకా సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ (27వ తేదీ అనుకుంటున్నారు)లో సినిమాని విడుదల చేయాలనుకుంటోంది. మరి.. ఈ కేస్‌ సంగతేంటి బాస్‌ అనే విషయానికొస్తే.. ‘లైకా’ సంస్థ ప్రతినిధిని ‘సాక్షి’ సంప్రదించింది. ‘‘అలాంటిదేం లేదు. ఇప్పటి (శనివారం సాయంత్రం) వరకూ అలాంటి ఆలోచనే లేదు. లాస్‌ ఏంజిల్స్‌లోని వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలో పనులు జరుగుతున్నాయి.

ఒకే కంపెనీ ఆధ్వర్యంలో జరిగితే ఏప్రిల్‌ కల్లా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే అక్కడి మరో ప్రముఖ వీఎఫెక్స్‌ కంపెనీకి వర్క్‌ని డివైడ్‌ చేశామంతే’’ అని స్పష్టం చేశారు. ‘2.0’ రిలీజ్‌ని ప్రకటించడంతో తెలుగులో మహేశ్‌బాబు (‘భరత్‌ అనే నేను’), అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదల డైలమాలో పడ్డాయి. అక్కడ తమిళంలో కూడా అలా జరిగిందా? అని అడిగితే – ‘‘2.0’ రిలీజ్‌ టైమ్‌కి ఓ రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అయితే ‘2.0’ కోసం వాళ్లంతట వాళ్లు తమ సినిమా విడుదల తేదీని మార్చుకున్నారు’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు