రజనీ... మమ్ముట్టి... ఓ మరాఠీ సినిమా!

26 Nov, 2017 00:24 IST|Sakshi

రజనీకాంత్‌ మాతృభాష ఏంటో తెలుసా? మరాఠీ! కానీ, ఆయన జన్మించింది ఒకప్పటి మైసూర్‌ రాష్ట్రంలో! అదేనండీ... ఇప్పటి కర్ణాటకలో! ఇంతై వటుడింతై అన్నట్టు ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగింది మాత్రం తమిళనాడులో! దర్శకుడు బాలచందర్‌ తీసిన ‘అపూర్వ రాగంగాళ్‌’ (తెలుగులో ‘తూర్పు–పడరమ’)తో నటుడిగా పరిచయమైన రజనీ, ఆ తర్వాత పలు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలు చేశారు. కానీ, ఇప్పటివరకూ మాతృభాష మరాఠీలో ఒక్క సినిమా కూడా చేయలేదు.

త్వరలో చేయనున్నారని ముంబయ్‌ టాక్‌! రాజకీయ నాయకుడు, నిర్మాత బాలకృష్ణ సుర్వే నిర్మించనున్న ‘పసాయదన్‌’లో రజనీ నటిస్తారట! అంతే కాదండోయ్‌... అందులో ఆయనతో పాటు మలయాళ స్టార్‌ మమ్ముట్టి కూడా నటించనున్నారని అక్కడి జనాలు చెబుతున్నారు. సుమారు పాతికేళ్ల క్రితం వచ్చిన ‘దళపతి’లో రజనీ, మమ్ముట్టి నటించారు. తర్వాత వీళ్లిద్దరూ ఏ సినిమాలోనూ కనిపించలేదు.

మొన్నా మధ్య రజనీకాంత్‌ ‘కాలా’లో మమ్ముట్టి అతిథి పాత్ర చేస్తున్నారనే వార్త బయటకొచ్చింది. కానీ, అందులో నిజమెంత? అనేది ఇంకా తెలియలేదు. ఇంతలో దీపక్‌ భావే దర్శకుడిగా పరిచయం కానున్న ఈ మరాఠీ సినిమా వార్త! దీపక్‌ భావే కో–రైటర్‌గా పని చేసిన ‘ఇడక్‌’ను 48వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)లో ప్రదర్శించారు. ఆ తర్వాత రజనీ, మమ్ముట్టి కాంబినేషన్‌లో మరాఠీ సిన్మా అనే వార్త రావడం గమనార్హం!!

మరిన్ని వార్తలు