అన్నయ్య ఆలస్యంగా వస్తాడు

19 Jun, 2020 02:58 IST|Sakshi

అనుకున్న సమయానికి అన్నయ్య రాడట. ‘అయినా ఫర్వాలేదు.. మా అన్నయ్య లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాడు’ అని తమ్ముళ్లు (ఫ్యాన్స్‌) అంటున్నారు. రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో గత ఏడాది చివర్లో ఓ సినిమా ఆరంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రానికి ‘అన్నాత్తే’ అని టైటిల్‌ పెట్టినట్లు ప్రకటించారు. అంటే.. ‘అన్నయ్య’ అని అర్థం. 2021 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నామని చిత్రనిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ తెలిపింది.

అయితే లాక్‌డౌన్‌ ముందు వరకూ జరిపిన షెడ్యూల్స్‌లో 50 శాతం షూటింగ్‌ మాత్రమే పూర్తయింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. వచ్చే నెల కానీ మరో రెండు నెలల తర్వాత కానీ షూటింగ్‌ మొదలుపెట్టినా సంక్రాంతి లోపు పూర్తి చేయడం కష్టం అని చిత్రబృందం భావిస్తోందట. అందుకని విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: డి. ఇమ్మాన్, కెమెరా: వెట్రి.

మరిన్ని వార్తలు