నాతో పోటీనా అన్నారు

11 Apr, 2017 03:06 IST|Sakshi
నాతో పోటీనా అన్నారు

మహా నటుడు శివాజీగణేశన్‌ ఏరా నాతో పోటీయా? అన్నారని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. శివాజీగణేశన్‌ మనవడు, ప్రభు కొడుకు, యువ నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తూ, తొలిసారి నిర్మాతగా మారి ఫస్ట్‌ ఆర్టిస్ట్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం నెరుప్పుడా. నిక్కీగల్రాణి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు అశోక్‌కుమార్‌ పరిచయం అవుతున్నారు.

 ఆర్‌డి. రాజశేఖర్‌ ఛాయాగ్రహణం, సాన్‌రోల్డన్‌ సంగీతం  అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక బోగ్‌రోడ్డులోని శివాజీ గణేశన్‌ ఇంటి ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు రజనీకాంత్‌ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి సీడీని శివాజీగణేశన్‌ తనయులు రామ్‌కుమార్, ప్రభు, గిరి అందుకున్నారు.

 కార్యక్రమంలో పాల్గొ న్న మరో అతిథి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్‌ సంఘం కార్యదర్శి, నటుడు విశాల్‌ మాట్లాడుతూ సినిమాపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. అలాంటి సినిమా విడుదలైన తొలి రోజు, తొలి ప్రదర్శన ముగిసిన వెంటనే మీడియా వర్గాలు విమర్శలు రాసేస్తున్నారన్నారు. అలాంటి విమర్శలు చిత్రాన్ని తీవ్రంగా ప్రభా వితం చేస్తున్నాయన్నారు. అందువల్ల రెండు, మూడు రోజు ల తరువాత విమర్శలు రాస్తే బాగుంటుందని అన్నారు.

ఏరా పోటీనా అన్నారు
నటుడు రజనీకాంత్‌ మాట్లాడుతూ నెరుప్పుడా చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని అన్నారు. చిత్ర ట్రైలర్‌ చాలా బాగుంది. విక్రమ్‌ప్రభు నిర్మాతగా కూడా నూరు శాతం సక్సెస్‌ అవుతారన్నారు. శివాజీ గణేశన్‌తో కలిసి తాను పడయప్పా చిత్రంలో నటించానని ఆ చిత్రం ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. ఒక సారి ఫోన్‌ చేసి ఫ్రీగా ఉన్నావా? ఇంటికి రా బిరియాని పెడతాను అని అన్నారన్నారు. సరే ప్రత్యేకంగా పిలిచారని వెళితే అప్పటికే 200 మంది ఉన్నారన్నారు.

 అదే విధంగా బిరియాని పెడతారని చూస్తే పలు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయన్నారు. ఆయన ఇంట్లో ప్రతి ఆదివారం అలాగే జరుగుతుండేదని తెలిపారు. అన్నామలై చిత్రంలో తాను శివాజీగణేశన్‌ నటనను అనుకరిస్తూ నటించానన్నారు. చిత్రాన్ని ఆయనకు చూపించగా ఏరా నాకు పోటీయా? అని సరదాగా అన్నారని, తరువాత చాలా బాగా నటించావని అభినందించారని గుర్తు చేసుకున్నారు.

 నటనలో శివాజీగణేశన్‌కు పోటీ ఎవరూ లేరని అన్నారు. ఇక విక్రమ్‌ప్రభు ఉన్నత స్థాయికి ఎదగాలని ఇక్కడ అందరూ ఆశీర్వదిస్తున్నారని, ఆయనకు అంతకు మించిన బరువు, బాధ్యతలు ఉన్నాయని, అవన్నీ ప్రభు చక్కగా నిర్వర్తించగలరని అన్నారు. విక్రమ్‌ప్రభు తన తాత, తండ్రుల పేరును కాపాడాలనే తపనతో ఉన్నారని కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడని అన్నారు.

విశాల్‌ కోరికలో న్యాయం ఉంది
విశాల్‌ మీడియా ముందుంచిన కోరికలో న్యాయం ఉందని అన్నారు. చిత్రం విడుదలైన రెండు మూడు రోజుల తరువాత విమర్శలు రాస్తే బాగుంటుందని అన్నారు. అదే విధంగా నిర్మాతలు అందరూ బాగుండాలన్న భావనతో చిత్రాలు నిర్మించాలని, తానొక్కడినే లబ్ధి పొందాలనుకోరాదని  అన్నారు. పంపిణీదారులు కూడా ముందుగా బాగా ఆలోచించి, సీనియర్ల సలహాలను తీసుకుని చిత్రాలను కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, కలైపులి ఎస్‌. థాను, దర్శకుడు పి. వాసు, సత్యరాజ్, ధనుష్, ఆర్‌. పన్నీర్‌సెల్వం, అరుళ్‌పతి, లారెన్స్, నిక్కీగల్రాణి, ప్రభుసాలమన్, సాన్‌రోల్డన్‌ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నటుడు ప్రభు ధన్యవాదాలు తెలిపారు.