ఆ దేవుడు ఆశిస్తే... నేను ఆచరిస్తాను!

17 Aug, 2014 23:06 IST|Sakshi
ఆ దేవుడు ఆశిస్తే... నేను ఆచరిస్తాను!

 ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ‘లింగా’ రూపంలో మంచి బహుమతి ఇవ్వడానికి రజనీకాంత్ సన్నాహాలు చేస్తున్నారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీ, అనుష్క, సోనాక్షీ సిన్హా నాయకా నాయికలుగా రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికి 80 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం మంగళూరులో చివరి షెడ్యూల్ చేస్తున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు నిరవధికంగా జరిపే షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తవుతుంది. ‘‘ఈ చిత్రాన్ని నా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని రజనీ ప్రకటించారు.
 
 మంగళూరు షెడ్యూల్‌లో పాల్గొనడానికి ఆయన చెన్నయ్ నుంచి అక్కడికెళ్లారు. అప్పుడు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తనను చుట్టుముట్టిన మీడియాతో రజనీ ఈ విధంగా చెప్పారు. ఓ పాత్రికేయుడు.. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అసలు ఎప్పుడు రావాలనుకుంటున్నారు?’ అని అడిగితే - ‘‘ఆ దేవుడి ఇష్టమే నా ఇష్టం. ఒకవేళ నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆ దేవుడు ఆశిస్తే.. నేను ఆచరిస్తాను’’ అని తనదైన స్టయిల్‌లో చెప్పారు రజనీ. ఆరోగ్యం గురించి అడగ్గా... ‘‘ఆ మధ్య అనారోగ్యంపాలయ్యాను. అందులోంచి క్షేమంగా బయటపడ్డాను. ఇప్పుడు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. బాగున్నాను’’ అని రజనీ స్పష్టం చేశారు.