సూపర్ స్టారా... మజాకానా!

19 Oct, 2014 23:09 IST|Sakshi
సూపర్ స్టారా... మజాకానా!

సినిమాలో నటించడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరో ఎత్తు. షూటింగ్ లొకేషన్లో పెదాలు ఎలా అయితే కదిపి మాట్లాడతారో, దానికి తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పాలి. లేకపోతే పెదాల కదలికకు, మాటకు సంబంధం ఉండదు. అందుకే, డబ్బింగ్ చెప్పడం కష్టం అంటారు. ఇతర పాత్రల సంగతెలా ఉన్నా.. సినిమా మొత్తం హీరో కనిపిస్తాడు కాబట్టి, ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. పైగా పంచ్ డైలాగ్‌లు, పవర్‌ఫుల్ డైలాగులకు కొదవ ఉండదు. అందుకే, డబ్బింగ్‌కి కనీసం మూడు నుంచి పదిరోజుల వరకైనా తీసుకుంటారు.
 
 కానీ, రజనీకాంత్ ఇటీవల ఒకే ఒక్క రోజులో ‘లింగా’లో తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేసి, ఆ చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచారు. 24 గంటల్లోపే డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసేశారని, ‘సూపర్ స్టారా... మజాకానా?’ అని ఆ చిత్రబృందం రజనీని తెగ పొగిడేస్తోంది. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయ్యింది. రజనీ పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబర్ 12న ‘లింగా’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.