రజనీకాంత్‌కు నోటీసులు.. సినిమా డౌటే!

13 May, 2017 16:53 IST|Sakshi
రజనీకాంత్‌కు నోటీసులు.. సినిమా డౌటే!

మన దేశంలో చీకటి సామ్రాజ్యాన్ని తొలినాళ్లలో చక్రవర్తిగా ఏలిన వ్యక్తి.. హాజీ మస్తాన్. ముంబై అండర్ వరల్డ్ ప్రపంచంలో తొలిసారిగా వినిపించిన అతి కొద్ది పేర్లలో అదొకటి. అతడి జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ మరోసారి హాజీమస్తాన్ బయోపిక్ తీస్తున్నారన్న వార్తలు రావడంతోనే.. ఆయనకు ముంబై నుంచి నోటీసులు వచ్చాయి. హాజీమస్తాన్‌ తనకు గాడ్‌ఫాదర్ అని చెప్పుకొంటున్న సుందర్ శేఖర్ అనే వ్యక్తి ఈ నోటీసులు పంపారు. హాజీ మస్తాన్ స్థాపించిన భారతీయ మైనారిటీ సురక్షా మహాసంఘానికి తాను జాతీయ అధ్యక్షుడినని ఆయన చెప్పుకొన్నారు. హాజీ మస్తాన్‌ను ఒక స్మగ్లర్‌గాను, అండర్‌వరల్డ్ డాన్‌గాను చిత్రీకరించాలని అనుకుంటున్నట్లు తనకు తెలిసిందని, అయితే ఆయన ప్రముఖ జాతీయ రాజకీయ నాయకుడని ఆ నోటీసులలో చెప్పారు.

ఆయన పాత్రను అలా చిత్రీకరించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, అసలు మస్తాన్ జీవితంలో ఎప్పుడూ ఏ కోర్టులోనూ స్మగ్లింగ్ లేదా అండర్ వరల్డ్ కార్యకలాపాలలో దోషిగా నిలబడలేదని తెలిపారు. ఇద్దరం తమిళనాడు నుంచే రావడంతో తనను ఆయన కన్నబిడ్డలా పెంచారు గానీ ఏరోజూ మతం మారాల్సిందిగా బలవంతం చేయలేదన్నారు. ఆయన ఎక్కడకెళ్లినా తాను వెంట ఉండేవాడినని, తాను తప్ప వేరెవ్వరూ ఆయనకు అంత సన్నిహితంగా లేరని సుందర్ శేఖర్ ఆ నోటీసులలో చెప్పారు.

నిజంగా హాజీ మస్తాన్ మీర్జా జీవిత చరిత్ర మీద సినిమా తీయాలనుకుంటే తాను అన్ని విషయాలూ చెబుతానని, తాను ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిని కావడంతో తనకు కూడా తన గాడ్‌ఫాదర్ జీవితచరిత్ర మీద ఒక సినిమా తీయాలని ఉందని తెలిపారు. ఆయన వెనక ఇప్పుడు ఓ పెద్ద రాజకీయ పార్టీ ఉందని, ఆ పార్టీ కార్యకర్తలంతా ఆయనను ఒక స్మగ్లర్‌గా చిత్రీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగితే తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా