ప్రజాస్వామ్య కళ సినిమా

16 Apr, 2017 03:29 IST|Sakshi
ప్రజాస్వామ్య కళ సినిమా

చెన్నైలో దర్శకుడు భారతీరాజా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రజనీ, కమల్, రాధ, పూర్ణిమాజయరాం పాల్గొని సందడి చేశారు.

తమిళసినిమా:  పలువురు కలిసి రూపకల్ప న చేసే ప్రజాస్వామ్య కళ సినిమా అని విశ్వనటుడు కమలహాసన్‌ పేర్కొన్నారు. దర్శకుడు భారతీరాజా స్థానిక తేనాంపేట, స్కీమ్‌ రోడ్డులోని మాన్‌సరోవర్‌ టవర్‌లో నెలకొల్పిన భారతీరాజా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది.

ఈ కార్యక్రమానికి నటుడు కమలహాసన్, రజనీకాంత్, శివకుమార్, కార్తీ, గీతరచయిత వైరముత్తు మొదలగు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసు హాజరయ్యారు. రజనీకాంత్‌ మాట్లాడుతూ దర్శకుడు భారతీరాజా ఇప్పటికీ యువకుడిగా కనిపించడానికి రెండు కారణాలన్నారు.ఆయన యుక్త వయసులో ప్రకృతి ద్వారా పండించిన ఆహార పదార్థాను తినడం ఒకటైతే నేటికీ సినిమానే ప్రేమించడం అని అన్నారు.యుక్త వయసులో శ్రమించాలి.వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటూ బిజీగా ఉండాలని అన్నారు.

 భారతీరాజాకు నేను నచ్చను
భారతీరాజా అంటే తనకు చాలా ఇష్టం అన్నారు.అయితే ఆయనకు తాను నచ్చనని అన్నారు. ఇంతకుముందొక పత్రికకిచ్చిన భేటీలో ఆయన తన గురించి అడిగిన ప్రశ్నకు రజనీకాంత్‌ మంచి మనిషి అన్నారే గానీ మంచి నటుడని చెప్పలేదన్నారు.అలా ఆయన తనను నటుడిగా అంగీకరించలేదని పేర్కొన్నారు. తాను ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న దానికంటే దర్శకుడు కే.బాలచందర్‌ నుంచి ఎక్కువ తెలుసుకున్నానని అన్నారు.కమలహాసన్‌ మాదిరి తనకు సాంకేతిక పరిజ్ఞానం గురించి పెద్దగా తెలియదన్నారు.భారతీరాజా నెలకొల్సిన ఈ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో సినిమా గురించి చాలా నేర్చుకోవచ్చునని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

కళాకారులను తీర్చిదిద్దడంలో భారతీరాజా దిట్ట
అడ్డంకులను అధిగమించి కళాకారులను తీర్చిదిద్దడంలో భారతీరాజా దిట్ట అని నటుడు కమలహాసన్‌ వ్యాఖ్యానించారు. సినిమా అన్నది పలువురు కలిసి రూపకల్పన చేసే ప్రజాస్వామ్య కళ అని పేర్కొన్నారు.ఆ కళ తెలిసిన భారతీరాజా పలువుర్ని కళాకారులుగా తీర్చిదిద్దారన్నారు.తాను తెలుసుకున్నదాన్ని పలువురికి నేర్పించిన భారతీరాజా జైన్‌ గురువు లాంటి వారని పేర్కొన్నారు.

నేనెవరినీ తీర్చిదిద్దలేదు
అనంతరం దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ తాను పలువుర్ని  కళాకారులుగా తీర్చిదిద్దినట్లు ఈ వేదికపై ఉన్న వాళ్లు ప్రశంసిస్తున్నారని, నిజానికి తానెవరినీ తీర్చిదిద్దలేదని, కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీశానంతేనని పేర్కొన్నారు. 330 రూపాయలతో లారీ ఎక్కి చెన్నైకి వచ్చిన తనను సినిమా పరిపూర్ణ మనిషిని చేసిందని భారతీరాజా అన్నారు.