రజనీ ఆ విషయాన్ని ఎప్పుడూ మరచిపోరు

13 Dec, 2016 08:51 IST|Sakshi
రజనీ ఆ విషయాన్ని ఎప్పుడూ మరచిపోరు

చెన్నై: తమిళ  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో బస్‌ కండెక్టర్‌గా పనిచేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. వెండితెరపై స్టయిల్‌గా కనిపించే రజనీ నిజజీవితంలో సింపుల్‌గా ఉంటాడు. సోమవారం రజనీ 66వ ఏట అడుగుపెట్టాడు. అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రధాని నరేంద్ర మోదీ.. రజనీకాంత్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. రజనీ బర్త్‌ డే సందర్భంగా ఆయన కుమార్తె సౌందర్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. తన తండ్రి, కుటుంబం గురించి పలు విషయాలు చెప్పింది. సౌందర్య ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

నాన్న చాలా సింపుల్‌: నాన్న చాలా సింపుల్‌గా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాన్ని ఆయన ఎప్పుడూ మరిచిపోరు. నేను, నా సోదరి  ఐశ్వర్య ఈ విషయాన్ని నాన‍్న నుంచి నేర్చుకున్నాం. మేం మూలాలను మరిచిపోం. అభిమానులు, నిర్మాతలు ఎవరినైనా నాన్న ఒకేలా చూస్తారు.   

నాన్నకు ఆయనంటే ఇష్టం: కబాలి సినిమాలో మలేసియాలో డాన్‌ పాత్రలో నటించారు. ఆయన వయసుకు దగ్గరగా ఉండే పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఓ సందేశం కూడా ఉంది. కబాలి దర్శకుడు రంజిత్‌ పా అంటే నాన్నకు ఇష్టం. కబాలికి ముందు నాన్న నటించిన రెండు సినిమాలు సరిగా ఆడలేదు. పరాజయాల ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అయితే నాన్న అలాంటి రకం కాదు. సినిమా పూర్తయిన తర్వాత అది హిట్‌ అయినా ఫ్లాప్‌ అయినా నాన్న పెద్దగా పట్టించుకోరు. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. నాన్న ఆరోగ్యంపై ఆ మధ్య వచ్చిన వార్తలన్నీ అబద్ధం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. కబాలి తర్వాత విరామం లేకుండా రోబో 2 సినిమాలో నటిస్తున్నారు.