రజనీకాంత్‌ ‘వ్యూహం’ ఫలించేనా!?

30 Oct, 2019 21:09 IST|Sakshi

పొలిటికల్‌ ఎంట్రీకి పనికొచ్చేలా కొత్త సినిమా

తమిళసినిమా: రజనీకాంత్‌ ఈ ఐదక్షరాల పేరు ఆలిండియా లెవల్‌లోనే ఒక అద్భుతం. రజనీ సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్‌ షేక్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ సెలబ్రేషన్‌ మూడ్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి రజనీ త్వరలోనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలాకాలం తరువాత ఆయన పోలీసు ఆఫీసర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం దర్బార్‌.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అదుర్స్‌ అనిపించింది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తనదైన స్టైల్‌లో చెక్కుతున్నారు.

ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, రజనీకాంత్‌ నటించబోయే మరో కొత్త సినిమాకు కూడా రంగం సిద్ధమైంది. దర్శకుడు శివ డైరెక్షన్‌లో  సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మింస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం పలు ఊహాగానాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సూపర్‌స్టార్‌ రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 12న ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కానుందని, ఈ సినిమా కోసం ఒక టైటిల్‌ కూడా పరిశీలనలో ఉందని టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. దర్శకుడు శివకు ‘వీ’ సెంటిమెంట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అజిత్‌ హీరోగా చేసిన నాలుగు చిత్రాల టైటిల్స్‌ వీతోనే మొదలయ్యాయి.

వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం ఇలా శివ ‘వీ’ టైటిల్‌ చిత్రాలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో చేసే చిత్రానికి ‘వీ’ సెంటిమెంట్‌ కలిసివచ్చేలా.. ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ‘వ్యూహం’  సినిమా రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి కూడా పనికొచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇందులో నటి జ్యోతిక, కీర్తీసురేశ్‌ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. నటుడు సూరి, వివేక్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రజనీకాంత్‌ 168వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2020లో సమ్మర్‌స్పెషల్‌గా తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు