రజనీ @ 168

12 Oct, 2019 00:19 IST|Sakshi
రజనీకాంత్‌

రజనీకాంత్‌ ‘దర్బార్‌’ సినిమా చిత్రీకరణ ముగిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి ఈ చిత్రం ముస్తాబవుతోంది. మరి.. రజనీకాంత్‌ తర్వాతి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఏ దర్శకుడిని వరిస్తుందనే ప్రశ్నకు శుక్రవారం సమాధానం దొరికింది. తమిళంలో అజిత్‌తో వరుసగా ‘వీరమ్‌’, ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి మాస్‌ సినిమాలను తెరకెక్కించిన శివ ఆ చాన్స్‌ను దక్కించుకున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ‘‘యందిరిన్‌ (తెలుగులో ‘రోబో’), ‘పేట’ చిత్రాల తర్వాత మరోసారి రజనీకాంత్‌గారి సినిమాను నిర్మించనుండటం సంతోషంగా ఉంది’’ అని సన్‌ పిక్చర్స్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇది రజనీకాంత్‌ కెరీర్‌లో 168వ చిత్రం. మాస్‌ ఎంటర్‌టైనింగ్‌ కథను రెడీ చేశారట శివ. ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో వచ్చిన ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ చిత్రాలు శివ దర్శకత్వంలోనే తెరకెక్కాయన్న సంగతి గుర్తుండే ఉంటుంది.

మరిన్ని వార్తలు