కండక్టర్‌ నుంచి సూపర్‌ స్టార్‌ వరకు ప్రతిదీ ఆశ్చర్యమే!

22 Mar, 2020 07:55 IST|Sakshi
రజనీకాంత్‌తో బేర్‌ గ్రిల్స్‌

నా జీవితం అంతా ఆశ్యర్యమేనని నటుడు రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఈయన మొట్టమొదటి సారిగా నటించిన అడ్వెంచర్‌ డాక్యుమెంటరీ చిత్రం ది మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌. ప్రముఖ డాక్యుమెంటరీ రూపకర్త బేర్‌ గ్రిల్స్‌ ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇలాంటి సాహసోపేతమైన డాక్యుమెంటరీని రూపొందించారు. తాజాగా నటుడు రజనీకాంత్‌తో రూపొందించారు. ఆ మధ్య బెంగళూర్‌ సమీపంలోని అడవుల్లో చిత్రీకరించిన సన్నివేశాల్లో రజనీకాంత్‌ నటించారు. ఇందులో పలు సాహసోపేతమైన సన్నివేశాల్లో ఈ సూపర్‌స్టార్‌ను చూడబోతున్నాం. ఈ డాక్యుమెంటరీ చిత్రం రేపు (సోమవారం) రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రచారంలో భాగంగా నటుడు రజనీకాంత్‌ ఇటీవల బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ఇన్‌ టు ది వైల్డ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ తన జీవితమే ఒక ఆశ్చర్యం అని పేర్కొన్నారు. ఒక బస్సు కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ స్టార్‌ నటులలో ఒకరుగా ఎదగడం వరకూ, ఇంకా పలు ఆశ్చర్యాలను చూస్తారని ఆయన అన్నారు. అందుకు ఈ డాక్యుమెంటరీ చిత్రమే ఒక ఉదాహరణ అని అన్నారు. తాను ఇలాంటి డాక్యుమెంటరీ చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. అదేవిధంగా డిస్కవరీ చానల్‌లో ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటానని భావించలేదన్నారు. ఆయన తన వ్యక్తిగత జీవితం, సినీ పయనం గురించి పలు విషయాలను పంచుకున్నారు. కాగా ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరువాత  వైల్డ్‌ డాక్కుమెంటరీలో నటించిన వ్యక్తి రజనీకాంత్‌నేనన్నది గమనార్హం. చదవండి: నవ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు! 

ఇది తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, హిందీ, మరాఠి సహా 8 భాషల్లో విడుదల కానుంది. దీని కోసం రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్‌ అన్నాత్త అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తీసురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  శివ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ఆగింది. అయితే అన్నాత్త చిత్రాన్ని దసరాకు తెరపైకి తాసుకురావడానికి యూనిట్‌ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. చదవండి: జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటలు ఏం జరగబోతుంది?

మరిన్ని వార్తలు