స్టయిల్ బ్రాండ్ రజనీకాంత్!

12 Dec, 2013 15:25 IST|Sakshi
స్టయిల్ బ్రాండ్ రజనీకాంత్!

తమిళనాట 1975లో ‘అపూర్వరాగంగళ్’ అనే సినిమా వచ్చింది. కమల్‌హాసన్, శ్రీవిద్య, మేజర్ సుందరరాజన్, జయసుధ అందులో ప్రధాన పాత్రధారులు. ఆ సినిమాలోని ఓ కీలక సన్నివేశం.  శ్రీవిద్య, కమల్‌హాసన్‌లకు పెళ్లి ఖాయమవుతుంది. శ్రీవిద్య ఇల్లంతా పెళ్లి హడావిడి. ఇంతలో ఆ ఇంటి గేట్ తెరుచుకుంటుంది. ఎదురుగా నల్లగా, మాసిపోయిన గడ్డంతో దేశదిమ్మరిలా ఓ వ్యక్తి. చూడ్డానికే వికారంగా ఉంటాడు. అంతే... అక్కడ పడింది ఇంటర్వెల్ కార్డ్. ప్రేక్షకుల్లో ఒకటే క్యూరియాసిటీ. ‘కథ మాంచి రసకందాయంలో ఉండగా... వీడెవడ్రా బాబూ... అపూర్వరాగంలో అపశ్రుతిలా’ అని. కానీ... ఆ వ్యక్తే... ఆ వ్యక్తే... తమిళ సినిమా రూపు రేఖలు మారుస్తాడని, ప్రాంతీయ సినిమా స్థాయిని వందకోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్తాడని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాధ్యుడవుతాడని, స్టార్‌డమ్ అనే పదానికి పర్యాయపదంగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆయన ఎవరో, ఆయన పేరేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదేమో!
 
 ఆయనో సమ్మోహనాస్త్రం: హిందీ సినిమా అంటే.. దేశం మొత్తం విడుదలవుతుంది. పైగా హిందీ మన జాతీయభాష. సో.. బాలీవుడ్‌లో నంబర్‌వన్ స్టార్ అంటే ఆ వ్యక్తి ఆలిండియా సూపర్‌స్టార్ అన్నమాట. ఉదాహరణకు అమితాబ్. కానీ... ఓ ప్రాంతీయ భాషా నటుడైన రజనీని ఇప్పుడందరూ ఆలిండియా సూపర్‌స్టార్ అంటున్నారు. అలా అనిపించుకోవడం ఆయనకెలా సాధ్యమైంది? దానికి సమాధానం ఒక్కటే. రజనీ అంటే ఓ సమ్మోహనాస్త్రం. దానికి భాషతో నిమిత్తం లేదు. ఒక్కసారి ఆ అస్త్ర ప్రయోగం జరిగిందంటే.. ఎవరైనా వశం కావాల్సిందే. మిస్సిండియాలు, మిస్ వరల్డులైనా సరే.. ఆయన స్టయిల్ ముందు వెలవెలబోవాల్సిందే. గొప్ప నటుడు కూడా: నటనలో, నడకలో, నవ్వులో, డైలాగు విరుపులో... ఏదో తెలీని మేజిక్. జనాలకు ఓ మెరుపును చూస్తున్న ఫీలింగ్.
 
 అదే రజనీకాంత్. ప్రస్తుతం ఆయన స్టయిల్ ఓ బ్రాండ్‌గా మారిపోయింది. అయితే... కేవలం రజనీకాంత్‌ని ఆ స్టయిలే సూపర్‌స్టార్‌ని చేసిందా? అనడిగితే.. చాలామంది అవుననే అంటారు. కానీ అది నిజం కాదు. రజనీకాంత్ గొప్ప నటుడు కూడా. ఆయన అభినయ సామర్థ్యానికి స్టయిల్ అనేది ఓ ఆభరణం అయ్యింది అంతే. రజనీ గొప్ప నటుడు కాబట్టే ‘రాఘవేంద్రస్వామి’ లాంటి యోగీంద్రుని పాత్ర పోషించి మెప్పించగలిగారు. తమిళనాట ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేశారాయన. ఓ నటుడు గొప్పతనం బయటపడేది ఆ నటుడు ఎదుర్కొన్న పోటీని బట్టే. మరి రజనీకి పోటీ ఎవరు? అనంటే.. వచ్చే సమాధానం ‘కమల్‌హాసన్’. అంతటి మహానటుడు పోటీగా ఉన్నా... ఢీకొని మరీ... తమిళనాట నంబర్‌వన్ అయిన రజనీని గొప్ప నటుడు కాదని ఎలా అనగలం?
 
 తెలుగు సినిమాతో అనుబంధం: రజనీని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమా? అంటే... కొందరు ‘దళపతి’ అని,  ఇంకొందరు ‘బాషా’ అని అంటారు. కానీ నిజానికి రజనీ ఏనాడో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తెలుగు సినిమాతో ఆయన బంధం 37 ఏళ్ల నాటిది. కె.బాలచందర్ ‘అంతులేనికథ’ తో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యారు. ఎన్టీఆర్‌తో కలిసి ‘టైగర్’, కృష్ణతో కలిసి అన్నాదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీం, శోభన్‌బాబుతో ‘జీవనతరంగాలు’, చిరంజీవితో ‘కాళీ’ చిత్రాల్లో నటించారాయన. చిలకమ్మ చెప్పింది, తొలిరేయి గడిచింది, ఆమెకథ, వయసు పిలిచింది, ఇద్దరూ అసాధ్యులే, అందమైన అనుభవం, మాయదారి కృష్ణుడు, నా సవాల్, న్యాయం మీరే చెప్పాలి, అమ్మ ఎవరికైనా అమ్మే... ఎలా ఎన్నో తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర కనబరిచారు. ఒకానొక దశలో తెలుగు, తమిళ సినిమాల్లో సమాంతరంగా నటించారు. ఓ విధంగా తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించిన తమిళ హీరో రజనీకాంతే అని చెప్పాలి.
 
 అదీ రజనీ లైఫ్ స్టయిల్: నేటితో సూపర్‌స్టార్‌కి 63 ఏళ్లు నిండాయి. ఈ వయసులో కూడా యువతరాన్ని ప్రభావితం చేస్తున్నారాయన. బాలీవుడ్ సూపర్‌స్టార్లకు సైతం ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. దేశంలోనే అత్యధిక పారితోషికంగా తీసుకునే కథానాయకుడు కూడా రజనీనే. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఏ ప్రాంతీయ నటుడూ సాధించని క్రెడిట్ ఇది. కేవలం సినిమాల వల్లే రజనీకాంత్ ఈ స్థాయికి రాలేదు. ప్రవర్తన కూడా ఆయన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. సూపర్‌స్టార్లకే తలమానికంగా ఎదిగినా, తెరవెనుక  ఇవేమీ పట్టనట్లే కనిపిస్తారాయన. సగటు మనిషి ఆహార్యం, సాధారణ జీవితం, నిరంతరం ఆధ్యాత్మిక చింతన, ధారాళమైన దానగుణం.. ఇదీ రజనీకాంత్ లైఫ్ స్టయిల్. తన సినిమా వల్ల నష్టపోయిన పంపిణీదారులకు డబ్బు వెనక్కు ఇచ్చి ఆదుకునే ఉదార స్వభావుడు. గుళ్లో ప్రసాదం కోసం లైన్లో నిలబడ్డ చిన్ననాటి రోజుల్ని కూడా ఇప్పటికీ మరచిపోరు. ఒక స్టార్‌గానే కాదు... ఒక వ్యక్తిగా కూడా ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడు రజనీకాంత్. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.