అభిమానులకు తలైవా హెచ్చరిక

19 Nov, 2018 13:17 IST|Sakshi

పెరంబూరు: నటుడు రజనీకాంత్‌ తన అభిమానులకు, ప్రజాసంఘ కార్యకర్తలకు, థియేటర్ల మాజమాన్యానికి ఒక హెచ్చరిక చేశారు. రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం 2.ఓ. ఈ చిత్రాన్ని శంకర్‌ దర్శకత్వంలో లైకా సంస్థ సుమారు రూ.550 కోట్లతో రూపొందించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ఈ నెల 29న విడుదలకు ముస్తాబుతోంది. కాగా స్టార్స్‌ చిత్రాలకు థియేటర్లలో నిర్ణయించిన ధరకంటే అధికంగా విక్రయిస్తున్నారు.

అదే విధంగా స్టార్స్‌ అభిమానులమంటూ కొందరు రూ. 200 టికెట్‌ను రూ. 2వేలు, 3వేలకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఇటీవల విజయ్‌ నటించిన సర్కార్‌ చిత్రానికి ఇలానే జరిగింది. దీంతో రజనీకాంత్‌ ఆదివారం తన ప్రజా సంఘం కార్యకర్తలకు, థియేటర్ల మాజమాన్యానికి ఒక హెచ్చరిక చేశారు. త్వరలో విడుదల కానున్న  2.ఓ చిత్రానికిగానూ థియేటర్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు అని చెప్పి పొందిన టికెట్లను బయట వారికి విక్రయించరాదు. అదే విధంగా అభిమానుల నుంచి థియేటర్ల మాజమాన్యం నిర్ణయించిన టికెట్‌ కంటే అధికంగా వసూలు చేయరాదు. దీన్ని అతిక్రమించి నిర్వాహకులు, కార్యకర్తలు ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకుంటామని రజనీకాంత్‌ తన ట్విట్టర్‌ ద్వారా హెచ్చరించారు.

మరిన్ని వార్తలు