నేను హీరోయిన్ కాకపోవడానికి కారణం అదే!

25 Nov, 2013 00:54 IST|Sakshi
నేను హీరోయిన్ కాకపోవడానికి కారణం అదే!
 దాదాపు ప్రతి సినిమాలోనూ కనిపించే కేరక్టర్ ఆర్టిస్టు రజిత. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా రజితతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ....
 
 ముందు మీ నేపథ్యం చెప్పండి? 
 మాది కాకినాడ. నాన్న నా చిన్నప్పుడే దూరమయ్యారు. అమ్మ కష్టపడి టెన్త్ వరకూ చదివించింది. తర్వాత చెన్నయ్ షిఫ్ట్ అయ్యాం. అక్కడ ఇంటర్ జాయిన్ అయ్యాను. అయితే.. అనుకోకుండా ఆర్టిస్ట్‌గా బిజీ అవ్వడంతో చదువు అటకెక్కేసింది.
 
 అసలు నటిగా ఎలా మారారు?
 అది 1989 నాటి మాట. ఏఎన్నార్‌గారు, నాగార్జునగారు నటించిన ‘అగ్నిపుత్రుడు’ షూటింగ్‌కి మా బంధువైన సీనియర్ నటి కృష్ణవేణితో వెళ్లాను. అక్కడ పరుచూరి గోపాలకృష్ణగారు చూసి, నన్ను ఏఎన్నార్‌గారి కూతురి పాత్రకు రాఘవేంద్రరావుగారికి రికమెండ్ చేశారు. నేను చేయను మొర్రో అంటున్నా.. బలవంతంగా నాతో ఆ పాత్ర చేయించేశారు. అలా అనుకోకుండా నటిని అయ్యాను. నేను నటిగా మారి 24 ఏళ్లు నిండాయంటే నమ్మశక్యం కావడం లేదు. 
 
 హీరోయిన్ అవుదామని ఎప్పుడూ అనిపించలేదా?
 చాలామందికి తెలీని విషయం ఏంటంటే.. నేను మలయాళ, కన్నడ, ఒరియా చిత్రాల్లో కథానాయికగా చేశాను. తెలుగులో రాజేంద్ర ప్రసాద్‌గారి ‘సాహసం సేయరా డింభకా’ చిత్రంలో నాది దాదాపు సెంకడ్ హీరోయిన్ పాత్రే. ఇక్కడ తెలుగమ్మాయిలు కథానాయికలుగా నిలదొక్కుకోవడం కష్టం. నేను కథానాయికను కాకపోవడానికి కారణం అదే. అయితే... దూరదర్శన్‌లో ప్రసారమైన టెలీఫిలిం ‘తూర్పులో పడమర’లో కథానాయికగా నటించాను. అందులో నా పేరు ‘ముద్దబంతి’. ఆ పాత్ర నాకెంతో పేరు తెచ్చింది. 
 
 ఎలాంటి నటనానుభవం లేకుండానే నటిగా ఎలా సక్సెస్ సాధించగలిగారు?
 ఇప్పటికీ నాకు నటన చేతకాదు. చెప్పింది చేసుకుంటూ వెళ్తానంతే. నాకు ఎలాంటి పాత్రలు కరెక్టో, ఎలాంటి పాత్రలకు నా నుంచి బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ వస్తుందో, మన దర్శకులకు బాగా తెలుసు. ఈ రోజు నేను సక్సెస్‌ఫుల్ నటిగా కొనసాగుతున్నానంటే కారణం నా దర్శకులే. 
 
 మీకు బాగా పేరు తెచ్చిన పాత్రలు?
 కోడి రామకృష్ణగారి ‘పెళ్లికానుక’ నాకు ఫస్ట్ బ్రేక్. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా... నాకు మంచి పేరు వచ్చింది. నంది అవార్డు కూడా తెచ్చింది. కేరక్టర్ నటిగానే కొనసాగాలని ఆ సినిమాతోనే నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’లో తనికెళ్ల భరణిగారి భార్య పాత్ర. ‘కొత్తబంగారులోకం’ చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్ర... ఇలా చెప్పుకుంటే మంచి పేరు తెచ్చిన పాత్రలు చాలానే ఉన్నాయి. 
 
 కేరక్టర్ ఆర్టిస్టులకు ఇండస్ట్రీలో మంచి గౌరవమే లభిస్తోందా?
 ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తక్కువే. 1995లో చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. పదేళ్ల పాటు తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొనేదాన్ని. రోజుకు 3,4 షిఫ్ట్‌లు చేసేదాన్ని. అప్పట్లో కేరక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ. అందుకే తగిన గౌరవం లభించేది. కానీ ప్రస్తుతం పరిస్థితి అలాలేదు. ఎప్పుడో సంక్రాంతికి ఓ సారి, శివరాత్రికి ఓ సారి మంచి పాత్రలొస్తాయి. అవి కూడా లక్ ఉన్నవాళ్లకే దొరుకుతాయి. దీనికితోడు కథలో కీలక పాత్ర అయితే... ముంబై నుంచి, చెన్నయ్ నుంచి ఆర్టిస్టులను దిగుమతి చేసుకుంటున్నారు. చిన్న పాత్రలయితే.. టీవీ ఆర్టిస్టులు పోటీకొచ్చేస్తున్నారు. ఇంత పోటీలో గౌరవం ఎక్కడ్నుంచి లభిస్తుంది? అయితే.. మగాళ్ల పరిస్థితి మాత్రం బాగుంది. బ్రహ్మానందంగారి నుంచి నిన్నమొన్న వచ్చిన ధన్‌రాజ్ వరకూ... అందరికీ విభిన్నమైన పాత్రలు దొరుకుతున్నాయి. దానికి తగ్గట్టే వాళ్లకు గౌరవం లభిస్తోంది. కానీ స్త్రీల విషయంలో అలాలేదు. పెద్ద సినిమాల్లో నటిస్తే పేరొస్తుంది. చిన్న సినిమాల్లో చేస్తే డబ్బులొస్తాయి. అంతటితో సరిపెట్టుకోవడమే. ఓ విధంగా చెప్పాలంటే.. మా కంటే రౌడీల పాత్రలు చేసేవాళ్లు ఎక్కువ బిజీగా ఉంటున్నారు.
 
 ఇంతమంది ప్రతిభావంతులు ఇక్కడ ఉండగా... పక్క రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను దిగుమతి చేసుకోవడం పట్ల మీరెలా స్పందిస్తారు?
 బాధగా ఉంటుంది. మనలో ప్రతిభ ఉంది. కానీ అవకాశాలు లేవు. పారితోషికం విషయంలో మేం ఓ రూపాయి ఎక్కువ చెబితే బడ్జెట్ అంటారు. కానీ పక్క రాష్ట్రాల నుంచి లక్షలు పోసి ఆరిస్టులను తెచ్చుకుంటారు. నిర్మాతలు ఈ విషయం పట్ల మనసు పెట్టి ఆలోచిస్తే మంచిది.