‘హగ్‌ డే’గా ప్రకటించిన బాలీవుడ్‌

20 Jul, 2018 18:58 IST|Sakshi
రాజ్‌కుమార్‌ రావ్‌ - సోనమ్‌ కపూర్‌ (ఫైల్‌ ఫోటో)

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఎంత వాడి వేడి చర్చ జరిగిందో అంత కంటే ఎక్కువ సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అవి కూడా ఇంతవరకూ ఎన్నడూ ఏ లోక్‌సభ సమావేశంలో కనిపించని దృశ్యాలు. ఈ రోజు రాహుల్‌ గాంధీ చేసిన పని లోక్‌సభ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదనుకుంటున్నారు జనాలు. అవిశ్వాస తీర్మానంపై చాలా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్‌ గాంధీ చివరలో అనూహ్యంగా సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పక్కన ఉన్న వారిని చూస్తూ కన్నుగీటారు. దాంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతుంది.

ఇప్పటికే నెటిజన్లు రాహుల్‌ చేసిన పనిని విమర్శిస్తుండగా తాజాగా వీరి కోవలోకి బాలీవుడ్‌ జనాలు కూడా వచ్చి చేరారు. రాహుల్‌ కౌగిలింత ఫలితంగా నేడు ‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’ జరుపుకోవాలంటూ పిలుపునిచ్చారు బాలీవుడ్‌ నటీనటులు. ‘క్వీన్‌’ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ తన ట్విటర్‌లో ఓపెనింగ్‌ షాట్‌ సన్నివేశాన్ని అనుకరిస్తూ ‘ఈ రోజు కౌగిలింతల దినోత్సవం’ అంటూ ప్రకటించారు. రాజ్‌ కుమార్‌ ట్వీట్‌కు స్పందిస్తూ సోనమ్‌ కపూర్‌ రెండు హగ్‌ ఎమోషన్స్‌ను రీ ట్వీట్‌ చేశారు. వీరిద్దరి ట్వీట్‌లను అభిమానులు తెగ లైక్‌ చేస్తున్నారు.

బీజేపీ రాహుల్‌ చేసిన పనిని చిన్న పిల్లల చేష్టలా ఉందని విమర్శిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌ దడ్లాని మాత్రం రాహుల్‌కు మద్దతు తెలిపారు. విశాల్‌ దడ్లాని తన ట్విటర్‌లో ‘రాహుల్‌ చేసిన పనిని విమర్శించడం కాదు. ఆలింగనం కంటే ముందు అతని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేమంతా దాని కోసం ఎదురు చూస్తోన్నాం’ అంటూ బీజేపీపై మండి పడ్డారు.

మరిన్ని వార్తలు