కబాలి చేతిలోని పుస్తకం ఏంటో తెలుసా..?

22 Jul, 2016 18:00 IST|Sakshi
కబాలి చేతిలోని పుస్తకం ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నుంచి కమల హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్ వరకు చాలామంది స్టార్ హీరోలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటనలో కూడా నటించలేదు. రజనీ తాజా సినిమా కబాలి విడుదల సందర్భంగా ఆయన క్రేజ్ను వాడుకునేందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డాయి. విశేషమేంటంటే.. ఎవరూ ఊహించనివిధంగా రజనీ ఓ తెలుగు రచయిత పుస్తకానికి విశేష ప్రాచుర్యం కల్పించారు.

కబాలి ట్రైలర్లో రజనీ జైల్లో ఓ పుస్తకాన్ని చదువుతూ కనిపిస్తారు. ఆ పుస్తకం ఏంటో తెలుసా? తెలుగు దళిత రచయిత ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ రాసిన మై ఫాదర్ బాలయ్య (తెలుగులో మా నాయిన బాలయ్య) పుస్తకం. ఈ ఇంగ్లీష్ వర్షెన్ పుస్తకాన్ని కబాలి సినిమాలో రజనీ చదువుతున్నట్టుగా కనిపిస్తారు. కబాలి ఫీవర్తో ఊగిపోతున్న ప్రేక్షకులకు ఈ పుస్తకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. రజనీ ద్వారా ఈ పుస్తకానికి దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కబాలి సినిమా మాదిరిగా ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్స్లో ఒకటిగా నిలిచినా ఆశ్చర్యంలేదని చెబుతున్నారు. రచయిత వైబీ సత్యనారాయణ.. దళితులు ఎదుర్కొన్న వివక్ష, ఆత్మగౌరవం కోసం వారు చేసిన పోరాటం గురించి రాశారు.