తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన పెళ్లి బహుమతి ఇది – సమంత

16 Oct, 2017 03:15 IST|Sakshi

‘‘అమ్మకు ఆస్ట్రాలజీ అంటే నమ్మకం. ఓ సారి ఓ ఆస్ట్రాలజర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు... ‘మీరు కొత్త పాత్రలు చేస్తే తప్పకుండా హిట్‌’ అన్నారు. అప్పట్నుంచి ఎప్పుడు కొత్త పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రాజుగారి గదిలో అందరూ డబ్బులు నిండుతున్నాయంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే, గదిలో ప్రశంసలు నిండటం చాలా హ్యాపీగా ఉంది. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ కన్నా పెద్ద హిట్టా మావయ్యా?’ అనడుగుతోంది సమంత. ఆ విషయం తనకు తర్వాత చెబుతా’’ అని నవ్వేశారు నాగార్జున.

ఓంకార్‌ దర్శకత్వంలో నాగార్జున, సమంత, శీరత్‌ కపూర్, అశ్విన్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్‌ ముఖ్య తారలుగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరైన్‌మెంట్స్, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించిన సినిమా ‘రాజుగారి గది–2’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ ఆదివారం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఫ్యాన్స్‌ ఫోన్‌ చేసి... ‘మా హీరో ఇలాంటి సినిమా చేశాడని కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతున్నాం’ అన్నారు. ఇలాంటి పాత్రలే చేయమని అడుగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? కొత్త కోడలు బ్లాక్‌ బ్లస్టర్‌ ఇచ్చింది.

ఈ హిట్‌కి నిర్మాతలు, ఓంకార్, తమన్, అబ్బూరి రవి నాలుగు స్తంభాలుగా నిలిచారు’’ అన్నారు. ‘‘ఈ విజయాన్ని తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన పెళ్లి బహుమతిగా భావిస్తున్నా. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్‌ బాగా రావడానికి, నేను బాగా నటించడానికి హెల్ప్‌ చేసిన మావయ్యకు థ్యాంక్స్‌’’ అన్నారు సమంత. ‘‘నైజాంలో ‘ఊపిరి’ ఫస్ట్‌డే షేర్‌ 80 లక్షలు అయితే... ‘రాజుగారి గది–2’కి కోటిన్నర వచ్చింది. సినిమా ఎంత హిట్టనేది చెప్పడానికే ఈ లెక్కలు చెప్పా. నాగార్జునగారి కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనుకుంటున్నా. అక్కినేని ఫ్యామిలీకి సమంత లక్కీ లేడీ’’ అన్నారు పీవీపీ.

‘‘పీవీపీగారితో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నందుకు హ్యాపీగా ఉంది. సినిమా పైరసీ కాపీలు వచ్చేశాయని విన్నాం. ప్లీజ్‌... కిల్‌ పైరసీ. థియేటర్లోనే సినిమా చూడండి’’ అన్నారు ‘మ్యాట్నీ’ జగన్‌. ‘‘ఓ ఫైట్‌ లేదు, పాట లేదు. అయినా... నాగార్జునగారు కథను నమ్మారు. ఆయన ఫ్యాన్స్‌ ఆయన్ను వేరేలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారేమోనని భయపడ్డా. కానీ, సినిమాను ఆదరించారు. అక్కినేని కోడలు ఇచ్చిన తొలి హిట్‌ తీసిన దర్శకుడిగా నాకు క్రెడిట్‌ దక్కినందుకు హ్యాపీ’’ అన్నారు ఓంకార్‌. శీరత్‌ కపూర్, అభినయ, అశ్విన్, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు.

రాజుగారి గది 2  సక్సస్ మీట్ వీడియో

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు