నేను కెప్టెన్‌... నాగార్జునగారు కోచ్‌!

10 Oct, 2017 01:04 IST|Sakshi

‘‘సిన్మాలో ఎంతమంది ఆర్టిస్టులున్నా... థియేటర్‌ నుంచి బయటకొచ్చిన ప్రేక్షకులకు గుర్తుండేది నాగార్జునగారు, సమంతలే. వాళ్లిద్దరి పాత్రలు సిన్మాకి హైలైట్‌. ముఖ్యంగా క్లైమాక్స్‌లో మామాకోడళ్లు తమ నటనతో చంపేశారంతే!’’ అన్నారు ఓంకార్‌. నాగార్జున హీరోగా ఆయన దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించిన ‘రాజుగారి గది–2’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఓంకార్‌ చెప్పిన సంగతులు...

► ‘రాజుగారి గది’ తర్వాత ఆ సిన్మాకి సీక్వెల్‌ స్టోరీ ఒకటి, ఫ్యామిలీ స్టోరీ మరొకటి రెడీ చేశా. వెంకటేశ్‌గారికి ‘రాజుగారి గది’ సీక్వెల్‌ కథ చెప్పా. అయితే... అదీ, ఇప్పుడీ సిన్మా కథ ఒక్కటి కాదు. వెంకీగారు ‘గురు’తో బిజీ. ఈలోపు నా స్నేహితులు వంశీ–శేఖర్‌ ద్వారా నిర్మాత పీవీపీగారిని కలిశా. ఆయనే సీక్వెల్‌ తీద్దామని, ఓ రోజు మలయాళ ‘ప్రేతమ్‌’ ట్రైలర్‌ లింక్‌ పంపించారు. అందులో ఉన్నది ఉన్నట్టుగా రీమేక్‌ చేస్తే ఆడదని చెప్పి, ‘ప్రేతమ్‌’లో మూలకథ తీసుకుని కొత్త కథ రాశా.

► పీవీపీ, మ్యాట్నీ సంస్థల పేరునీ, ‘రాజుగారి గది’కి వచ్చిన ఇమేజ్‌నీ దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేశా. కథ విన్న ‘మ్యాట్నీ’ నిరంజన్‌రెడ్డిగారు మెంటలిస్ట్‌ పాత్రకు నాగార్జునగారు, ఆత్మ పాత్రకు సమంత అయితే బాగుంటుం దన్నారు. నాగ్‌ సార్‌ కథ విన్న ఐదు నిమిషాల్లో ‘ఓకే’ చేసేశారు. సమంత కూడా కథ విన్న వెంటనే ‘ఐయామ్‌ డూయింగ్‌ దిస్‌’ అన్నారు. 

► ‘బౌండ్‌ స్క్రిప్ట్‌ పర్‌ఫెక్ట్‌గా వచ్చేవరకు సలహాలు ఇస్తా. షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాక  యు ఆర్‌ మై బాస్‌’ అన్నారు నాగ్‌ సర్‌. ఓ స్టార్‌ హీరోతో నేను వర్క్‌ చేయడం ఇదే మొదటిసారి. ఆయన అన్నట్లుగానే దర్శకుడిగా నాకు రెస్పెక్ట్‌ ఇచ్చి, ఎన్ని టేక్స్‌ అడిగినా చేశారు. మంచి సీన్స్, సిన్మా కోసం కొన్ని రీటేక్స్‌ తప్పలేదు. ‘బొమ్మరిల్లు’ క్లైమాక్స్‌ తర్వాత... మళ్లీ మాటల రచయిత అబ్బూరి రవికి అంత పేరు తీసుకొచ్చే క్లైమాక్స్‌నీ, మాటల్నీ ఇందులో రాశారు.

► ఇటీవల ఇంటర్వ్యూలో ‘ముంబైలో వద్దు, హైదరాబాద్‌లోనే గ్రాఫిక్స్‌ చేయిద్దామంటే, మీరు ముంబై కంపెనీకే గ్రాఫిక్స్‌ వర్క్‌ అప్పగించారని... దర్శకులు టైమ్‌సెన్స్‌ తెలుసుకోవాలి’ అని నాగార్జున చేసిన వ్యాఖ్యలను ఓంకార్‌ వద్ద ప్రస్తావించగా... ‘‘నాగార్జునగారిది 30 ఏళ్ల అనుభవం. నాకిది మూడో చిత్రమే. ఈ సిన్మాకి నేను కెప్టెన్‌ అయితే... ఆయనే మా కోచ్‌. మంచి క్వాలిటీ కోసమే ముంబై కంపెనీతో గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయించాం. అవుట్‌పుట్‌ చూసి, ఆయన హ్యాపీ ఫీలయ్యారు. నాగ్‌ సార్‌ మాటల్ని ఆశీర్వాదాలుగానే తీసుకున్నా. ఐయామ్‌ ఎ పాజిటివ్‌ పర్సన్‌. నెగిటివ్‌గా ఆలోచిస్తే... ముందుకు వెళ్లలేం’’ అన్నారు.

► ‘సమంత ఆత్మగా నటించారని నాగచైతన్య సినిమా చూడనన్నారట!’ అని ఓంకార్‌ని అడగ్గా... ‘‘అఖిల్‌ కూడా చూడనని చెప్పారట! రిలీజయ్యాక ఆడియన్స్‌ రెస్పాన్స్‌ చూసి తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.

మరిన్ని వార్తలు