కేంద్ర మంత్రికి రాజమౌళి రహస్యం చెప్పేశారు

12 Dec, 2016 15:22 IST|Sakshi
కేంద్ర మంత్రికి రాజమౌళి రహస్యం చెప్పేశారు
పనాజీ: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం ఎవరు చేసినా వెంటనే మన చెవులు ఆ వైపు పెట్టాలనిపిస్తుంటుంది. కానీ ఈసారి ఆ ముచ్చట గురించి చెబుతోంది చిన్న వ్యక్తి కాదు. ఓ కేంద్ర మంత్రి. అవును కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని విషయంపై మాట్లాడారు. ఆ గుప్త రహస్యం తనకు తెలుసని, అది తనకు చెప్పిన దర్శకుడు రాజమౌలికి ధన్యవాదాలు అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత వెండితెర చిత్రం ‘బాహుబలి ది బిగినింగ్‌’ . ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత ప్రతిష్టను ఇనుమడింపజేసుకుందో చెప్పనక్లర్లేదు. అయితే అంతే స్థాయిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న కూడా ఫేమస్‌ అయింది. దీనిపై ఇప్పటికే వేల ఊహాగానాలు జోకులుగా, సీరియస్‌ కామెంట్లుగా, వివరణలుగా సోషల్‌ మీడియాలో హల్ చల్‌ చేసి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. తాజాగా గోవాలో జరుగుతున్న 47 అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి దర్శకుడు రాజమౌళి కూడా ప్రత్యేక అతిథిగా వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన రాజ్యవర్ధన్‌ రాథోడ్‌కు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే రహస్యం చెప్పారంట. ఈ విషయాన్ని రాథోడ్‌ స్వయంగా సోమవారం ఈ చిత్రోత్సవానికి ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో వేదికపై నుంచి వెల్లడించారు. ‘బాహుబలిలాంటి బ్రిలియంట్‌ చిత్రాన్ని మనకు అందించిందనందుకు రాజమౌళికి నా ధన్యవాదాలు. అలాగే బాహబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం కూడా చెప్పినందుకు కూడా ధన్యవాదాలు. ఆయన ఎందుకు చెప్పారంటే మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు.. అంతేకాదు దేన్ని రహస్యంగా ఉంచాలో కూడా తెలుసు.. అందువల్ల రాజమౌళి నాకు చెప్పిన ఆ రహస్యం కూడా భద్రంగా ఉంటుంది’  అని రాథోడ్‌ అన్నారు.