‘శ్రీరెడ్డి నుంచి ప్రాణహాని’ 

29 Feb, 2020 08:27 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: సినీనటి శ్రీరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు రామారావు అలియాస్‌ రాకేష్‌ మాస్టర్‌ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌లోని ఏ బ్లాక్‌లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డ్యాన్స్‌ డైరెక్టర్‌ అండ్‌ డ్యాన్సర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, ఇప్పటివరకు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశానని, ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు. (హత్యా బెదిరింపులు.. శ్రీరెడ్డి ఫిర్యాదు)

గత నెల 28వ తేదీన సాయంత్రం శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో తనను చంపుతానని బెదిరించిందని, ఆమె అనుచరులతో ఫోన్‌ చేయిస్తూ బెదిరిస్తోందని వీడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనపై శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని, అక్కడి పోలీసులను హైదరాబాద్‌కు పంపించి చెన్నైకి ఈడ్చుకువచ్చి తనను అక్కడి పోలీసులతో కొట్టిస్తానని కూడా హెచ్చరిస్తోందని అన్నారు. అదేవిధంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి తాను చెప్పిన మాటలను అపార్థం చేసుకున్న ఆయన అభిమానులు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ పేరుతో ప్రతీరోజు తనకు వందల సంఖ్యలో కాల్‌ చేస్తూ చంపుతామని బెదిరించడమే కాకుండా, అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తన ఇంటికి వచ్చి తనను అంతం చేస్తామని కూడా బెదిరించారన్నారు. (శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు)

ఒకవైపు శ్రీరెడ్డి, ఇంకోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు హెచ్చరిస్తుండటంతో వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఓ చానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లైవ్‌లోనే శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని, తన మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటూ ఆ వీడియో రికార్డులను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. ఇటీవల తాను సీసీఎస్‌లో సైబర్‌క్రైమ్‌లో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ శ్రీరెడ్డి ఒత్తిడి తీసుకు వస్తోందని, అందులో భాగంగానే శాల్తీని లేపేస్తానంటూ బెదరిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి ఆధారాలు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (శ్రీరెడ్డి దొరికిపోయింది’)  

మరిన్ని వార్తలు