జీవితచరిత్ర రాస్తా

28 May, 2014 22:30 IST|Sakshi

 హిందీ చిత్రరంగంలో రాకేశ్ రోశన్ ప్రయాణం మొదలై నాలుగు దశాబ్దాలు దాటిపోయింది. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిన రాకేశ్... ప్రస్తుతం తన విజయగాధకు పుస్తక రూపం ఇవ్వాలని యోచిస్తున్నాడు.తన జీవితగాధ ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుందని ఆశిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన బుధవారం మీడియాకు వెల్లడించాడు. ఇదిలాఉంచితే 1949లో జనన ం మొదలుకుని తండ్రి  జీవిత యానానికి కుమార్తె సునయన ఇప్పటికే సంక్షిప్త చిత్ర రూపమిచ్చింది. దానికి ‘టు డాడ్ విత్ లవ్’ అని దానికి నామకరణం చేసింది.  బంధువులతోపాటు తెలిసిన వారి వద్ద నుంచి తండ్రి జీవితయానానికి సంబంధించిన అత్యంత పాత చిత్రాలను సేకరించింది. ఇందుకోసం తండ్రి పూర్వీకులు, సహచరులు, సహనటులు, కుటుంబసభ్యులతోనూ అనేక పర్యాయాలు సంప్రదించింది.

వారి వద్దనుంచి వీలైనంత మేర సమాచారం సేకరించింది. ఈ పుస్తకాన్ని ఓం బుక్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రచురించింది. అయితే చివరిదాకా ఈ విషయాన్ని తండ్రికి తెలియకుండా జాగ్రత్తపడింది. ఈ విషయమై రాకేశ్ మాట్లాడుతూ ‘త్వరలో నాజీవిత చరిత్ర రాయబోతున్నా. నా అనుభవాలను ఆ పుస్తకంద్వారా అందరితో పంచుకోవాలని అనుకుంటున్నా. ఎన్నో కష్టనష్టాలను ఎదురుచూశా. ఎంతో అనుభవం గడించా’ అని అన్నాడు. దివంగత రోశన్ కుమారుడైన రాకేశ్... తొలినాళ్లలో హెచ్.ఎస్. రావైల్, మోహన్‌కుమార్ వంటి దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 1970లో ఘర్ ఘర్‌కీ కహానీ ద్వారా తెరంగేట్రం చేశాడు.