పెళ్లికళ వచ్చేసింది

29 Nov, 2018 02:40 IST|Sakshi
శ్వేతాబసు, రోహిత్‌, ప్రియాంక, నిక్‌ జోనస్‌, రాఖీ సావంత్, దీపక్‌

సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా ఒక ట్రెండ్‌లా నడుస్తుంటుంది. ఒక సినిమా హిట్‌ అయితే అలాంటి ఫార్ములాతో వరుసగా సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో పెళ్లిళ్ల ట్రెండ్‌ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నే ‘దీప్‌వీర్‌’ (దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌) ఒక్కటయ్యారు. డిసెంబర్‌ 2న ప్రియానిక్‌ (ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌) జో«ద్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నారు.  పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగాలని ముంబైలోని ప్రియాంకా చోప్రా నివాసంలో బుధవారం పూజ  చేశారు. పెళ్లి పీటలెక్కనున్న ఈ జాబితాలోకి తాజాగా రాఖీ సావంత్, శ్వేతాబసు ప్రసాద్‌ చేరారు. శ్వేతాబసు ప్రసాద్‌ బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

డిసెంబర్‌ 13న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్‌ టాక్‌. మరోవైపు ఎప్పటికప్పుడు ఏదోఒక సెన్సేషన్‌తో వార్తల్లో నిలిచే రాఖీసావంత్‌ కూడా పెళ్లి కూతురు కాబోతున్నట్టు ప్రకటించారు. టెలివిజన్‌ యాక్టర్‌ దీపక్‌ కలాల్‌ను వివాహం చేసుకోబుతున్నట్టు సోషల్‌ మీడియాలో తెలిపారామె. డిసెంబర్‌ 31 సాయంత్రం 5: 55 నిమిషాలకు వీరి వివాహం లాస్‌ ఏంజెల్స్‌లో జరగనున్నట్టు పేర్కొన్నారు. ‘‘మేం ఒక్కటవ్వాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో చాలా మంది ఒక్కటవుతున్నారు. ఇదే రైట్‌ టైమ్‌ అనిపించింది. అందరి ఆశీర్వాదం మాకు కావాలి’’ అని రాఖీ సావంత్‌ బాలీవుడ్‌ మీడియాకు తెలిపారు. సో.. బాలీవుడ్‌కి పెళ్లికళ వచ్చేసిందన్నమాట.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు