స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌

15 Jun, 2020 12:40 IST|Sakshi
రక్తసంబంధం సీరియల్‌ షూటింగ్‌

సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం నగరంలో టీవీసీరియళ్ల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.  మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్‌ వంటి కరోనా నిబంధనల మధ్య..మళ్లీ తారల తళుకులు, కెమెరాల ఫ్లాష్‌లు, టెక్నీషియన్ల హడావుడితో సెట్లో సందడి కన్పించింది.

జూబ్లీహిల్స్‌: దాదాపు మూడునెలల విరామం తర్వాత తారలు తళుక్కుమంటున్నారు. కెమెరా ఫ్లాష్‌లు, లైట్‌బాయ్‌లు, క్లాప్‌లు, మేకప్‌ మ్యాన్లు, టెక్నీషియన్ల హడావుడి మధ్య కోట్లాదిమంది నిత్యం చూసే టీవీ సీరియళ్ల షూటింగ్‌ సందడి ఆదివారం నగరంలో ప్రారంభమైంది. కరోనా నిబంధనలు, ఆంక్షల మధ్య శానిటైజేషన్, మాస్కులు, భౌతికదూరంతో పనిచేయడం తదితర పక్కా రక్షణ ఏర్పాట్లతో షూటింగ్‌ ప్రారంభించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ మేరకు ఫిలింనగర్‌లో నిర్వహిస్తున్న రక్తసంబంధం టీవీ సీరియల్‌ బృందాన్ని ‘సాక్షి’ పలకరించగా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.  

కొత్తగా.. వింతగా ఉంది
మూడునెలల తర్వాత షూటింగ్‌లు ప్రారంభం కావడంతో అంతా కొత్తగా.. వింతగా ఉంది. షూటింగ్‌ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. అదే సమయంలో భయంగా కూడా ఉంది. ఏదిఏమైనా జీవితం ముందుకు సాగాలి. ప్రతిఒక్కరూ పనిచేయక తప్పదు. పూర్తిస్థాయి జాగ్రత్తలతో షూటింగ్‌లో పాల్గొంటున్నాం. – జాకీ, నటుడు

అన్ని జాగ్రత్తలతో..
మూడు నెలలుగా ఇంట్లోనే ఉండి లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబంతో ఎక్కువ కాలం గడిపే అవకాశం దొరికింది. ఇష్టమైన వంటలు చేసుకుంటూ బంధుమిత్రులతో వీడియో కాల్స్‌ మాట్లాడుకుంటూ హాయిగానే గడిపాం. ఇక జీవనోపాధి తప్పనిసరి. అన్ని జాగ్రత్తలతో షూటింగ్‌లో పాల్గొంటున్నాం. – జ్యోతిరెడ్డి, సీరియల్‌ నటి

నిబంధనల మేరకు షూటింగ్‌
ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్‌ చేస్తున్నాం. షూటింగ్‌ ప్రదేశాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నాం. నటులు, సిబ్బందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి అనుమతిస్తున్నాం. మాస్క్‌లు తప్పనిసరి చేశాం. ఆహారం కూడా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నాం. పీపీఈ కిట్లు ధరించిన మేకప్‌ సిబ్బంది నటీనటులకు మేకప్‌ చేస్తున్నారు.– సర్వేశ్వర్‌రెడ్డి, సీరియల్‌ నిర్మాత 

మరిన్ని వార్తలు