దూకిన తర్వాత భయం వేసింది

12 Feb, 2019 00:42 IST|Sakshi

‘‘ఈ ప్రేమికుల రోజుకి ప్రత్యేకం అంటూ ఏం లేదు. తొలిసారి మా అమ్మానాన్నలు, ఫ్యామిలీతో కలిసి ప్రేమికుల రోజున (గురువారం) నేను నటించిన ‘దేవ్‌’ సినిమాను హైదరాబాద్‌లో చూడబోతున్నా. అదే ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకం’’ అని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అన్నారు. కార్తీ, రకుల్‌ జంటగా రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవ్‌’. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమర్పణలో ‘ఠాగూర్‌’ మధు ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రకుల్‌ చెప్పిన విశేషాలు.

∙ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే అందమైన కథ ‘దేవ్‌’. ఇందులో స్త్రీవాద భావాలున్న మేఘన పాత్రలో నటించా. ప్రేమించడానికి టైమ్‌ లేదంటూ పనే ప్రపంచంగా ఉంటుంది మేఘన. తన తల్లిని ఓ వ్యక్తి ప్రేమించి మోసం చేయడంతో చిన్నప్పటి నుంచి ప్రేమపై మంచి అభిప్రాయం ఉండదు. అలాంటి భావాలున్న మేఘనని దేవ్‌ ప్రేమిస్తాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న వ్యక్తులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందన్న సంఘర్షణే ఈ సినిమా. ఇందులో కార్తీ సాహస యాత్రలు చేసే యువకుడిగా కనిపిస్తారు. 

∙నిజ జీవితంలో సాహసాలను ఇష్టపడతా. ఇటీవల దుబాయ్‌లో 15వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ చేశా. విమానంలోనుంచి దూకేశాక ప్యారాచూట్‌ ఓపెన్‌ కాకుంటే పరిస్థితి ఏంటి? బతుకుతామా? లేదా? చాలా సినిమాలు ఒప్పుకున్నా అనిపించింది (నవ్వుతూ). స్కై డైవింగ్‌ విషయం ముందే ఇంట్లో చెబితే అమ్మానాన్నలు భయపడతారని చెప్పలేదు. విషయం చెప్పి, వీడియో పోస్ట్‌ చేశా. 

∙తెలుగులో చేస్తున్న ‘వెంకీమామ’ సినిమా షూటింగ్‌ ఈ వారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నావి ఐదారు సినిమాలు రిలీజవుతాయి.

ప్రేమికుల దినోత్సవం అనేది విదేశీ సంస్కృతి. అందుకే నాకు నమ్మకం లేదు. అయినా ప్రేమకు ఒక్క రోజు కేటాయించడం ఏంటి? బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఏంటి? ఇది కమర్షియల్‌గా వర్కౌట్‌ అవుతుంది. ఒక్కరోజులో ప్రేమ వస్తుందనుకోను. ప్రేమ అన్నది లవర్‌తో, జీవిత భాగస్వామితో మాత్రమే కాదు. తల్లితండ్రులు, సోదరులు, సోదరీమణులు, ఫ్రెండ్స్‌.. ఇలా అందరిదీ ప్రేమే కదా. 

మరిన్ని వార్తలు