శ్రీదేవి గొప్పతనం అది

21 Mar, 2019 02:37 IST|Sakshi
అచ్చిరెడ్డి, రామారావు, రకుల్, ‘దిల్‌’ రాజు, బండారు సుబ్బారావు, ఆర్‌. నారాయణమూర్తి

– ఆర్‌. నారాయణమూర్తి

‘‘ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా ఇండియాలోనే ఒక నంబర్‌ 1 స్టార్‌గా ఎదిగిన శ్రీదేవిగారిపై రామారావుగారు పుస్తకం రాయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మూమెంట్స్‌ రామారావుగారితోనే ఆగిపోతాయేమో అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కమర్షియల్‌ అయిపోయారు’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. సీనియర్‌ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ప్రథమప్రతిని మాదాల రవి అందుకున్నారు. తొలిప్రతిని శివాజీరాజా కొనుగోలు చేశారు. యువకళావాహిని–సియోటెల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘అతిలోకసుందరి అనే టైటిల్‌ ఒక్క శ్రీదేవిగారికే సూట్‌ అవుతుంది. ఇండియాలో సూపర్‌స్టార్‌ శ్రీదేవిగారు. దురదృష్టవశాత్తు ఆమె మనకు దూరమయ్యారు. కానీ ఎప్పటికీ గుర్తు ఉంటారు. శ్రీదేవిగారిపై పుస్తకం రాసిన రామారావుగారికి శుభాకాంక్షలు’’ అన్నారు రకుల్‌. దర్శక–నిర్మాత– నటుడు ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘శ్రీదేవిగారు మరణించినప్పుడు ప్రపంచమంతా కన్నీరు కార్చింది.

ఆమె గొప్పతనం అలాంటిది. ఆమెపై పుస్తకం రాసిన పసుపులేటి రామారావుగారికి సెల్యూట్‌’’ అన్నారు. సినిమాల సెన్సార్‌ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడుతూ– ‘‘నా సినిమా సెన్సార్‌ సమస్య వల్ల ఓసారి ముంబై వెళ్లాను. శ్రీదేవిగారు ఏ తెలుగువారు అక్కడ కనిపించినా ఆత్మీయంగా మాట్లాడేవారు. నన్ను అక్కడ చూశారు. ‘బాగున్నారా? ఏంటి.. ఇలా వచ్చారు’? అన్నారు. ‘సెన్సార్‌ ఇబ్బందుల్లో పడ్డాను’ అన్నాను. ‘మీ విప్లవ సినిమాలు బాగుంటాయి. నాకు కూడా అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది’ అన్నారు.

ఇప్పుడు ఆ శ్రీదేవిగారు ఉంటే.. సెన్సార్‌ పరంగా ఇప్పుడు ఏవేం జరుగుతున్నాయో చూసి కన్నీరు పెట్టుకునేవారు. ఎంత దుర్మార్గమండి.. రామ్‌గోపాల్‌ వర్మగారు ఓ సినిమా (‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను ఉద్దేశించి) తీశారు. సెన్సార్‌ చేయరా? ఎవరెవరో వచ్చి ఎగిరిపడితే ఆపేస్తారా? పోసానిగారు ఓ సినిమా (‘ముఖ్యమంత్రిగారూ మీరు మాట ఇచ్చారు’ చిత్రాన్ని ఉద్దేశించి) చేశారు. దాన్ని సెన్సార్‌ చేయరా? అసలేం జరుగుతోంది. ఏం ప్రజాస్వామ్యం ఇది? సెన్సార్‌బోర్డ్‌ వాళ్లు చెబుతారా ఏ సినిమా చూడచ్చో, ఏది చూడకూడదో.

ఇలా నిర్మాతలను ఇబ్బంది పెడితే ఎలా? ఎన్‌.టీ  రామారావుగారి మీద ‘మండలాదీశుడు’ సినిమా తీస్తే... ‘రామారావుగారూ.. మీ గురించి ఇలా తీశారు’ అంటే.. ‘మా గురించి గొప్పగా చెప్పినా చూస్తారు. తిట్టినా చూస్తారు బ్రదర్‌’ అన్నారు. అదీ ఆయన సంస్కారం. 1962లో మనకు, చైనాకు యుద్ధం వచ్చిన సమయంలో నెహ్రూగారి విధానాలను తప్పుపడుతూ జర్నలిస్ట్, కార్టూనిస్ట్‌ ఆర్కే లక్ష్మణ్‌ కార్టూన్లు వేశారు. కొందరు రాజకీయనాయకులు ఆర్కే లక్ష్మణ్‌పై వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ‘‘కళాకారులు, జర్నలిస్టులు ప్రజలపక్షం. మనం వారి వాదనలను వినాలి.

వారి అభిప్రాయాలను గౌరవించాలి’’ అని నెహ్రూ అన్నారు. ఇప్పుడేంటండీ.. మనం సినిమా తీస్తాం. సెన్సార్‌ ఆగిపోవడమా? అమరావతి వెళ్లి వివరణ ఇచ్చుకోవడమా? ఎవరో కోర్టుకు వెళితే సినిమాను ఆపేయాలా? అలాంటప్పుడు సెన్సార్‌ బోర్డ్‌ పర్పస్‌ ఏంటి? ఇలాంటి సెన్సార్‌ విధానాన్ని ముక్తకంఠంతో ఖండించాలి’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారు పాత్రికేయులను బాగా గౌరవించేవారు’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు