స్పర్శలో తేడా ఉంటే తేడాగాళ్లే..!!

24 Nov, 2019 11:31 IST|Sakshi
సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): స్పర్శలో తేడాలు గమనించాలి. ముఖ్యంగా ఇది విద్యార్థి దశలోనే నేర్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి, చెడు స్పర్శలపై అవగాహన కల్పించాలి. అప్పుడే బాలికలు, యువతులపై జరుగుతున్న లైంగిక దాడులు కొన్నైనా ఆపవచ్చు’...అని సినీ నటి రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు.   555కే 2.0 వాక్‌ ముగింపు సందర్భంగా అక్కయ్యపాలెం దరి పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ ఓ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి ప్రతి రోజు చాక్లెట్‌ ఇచ్చేవాడని, అలా ఇస్తూ తనను తాకేవాడని...అదే విద్యార్థి తన తన తల్లి వద్ద చాక్లెట్‌ తీసుకున్నప్పుడు ఆమె చేతి స్పర్శ గమనించిందని, ఉపాధ్యాయుడి చేతి స్పర్శ, తల్లి చేతి స్పర్శలో తేడా ఉండడంతో టీచర్‌పై ఫిర్యాదు చేసిందన్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నందున వారికి స్కూళ్లలోనే ఈ విషయం తెలియజేయాలన్నారు.

555కే వాక్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు, సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ముగించిన, సహకరించిన వారందరినీ రకుల్‌ అభినందించారు. ముందుగా 5ఏఎం క్లబ్‌ వ్యవస్థాపకుడు, 555కే వాక్‌ నిర్వాహకుడు కేవీటి రమేష్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలపై జరుగుతున్న హింస, లైంగిక దాడుల విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫిట్‌ ఇండియా, పోలియో నిర్మూలన దిశగా ముందడుగు వేసేందుకు 18వ తేదీన ఈ యాత్ర ప్రారంభించామన్నారు. ఈ వాక్‌ విజయవాడలో ప్రారంభించి గుడివాడ, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, అమలాపురం, రాజోలు, యానాం, రామచంద్రపురం, రాజమండ్రి, తుని, అనకాపల్లి మీదుగా సాగిందని తెలిపారు.  ఈ 5రోజుల యాత్రలో 55మంది సభ్యులు సుమారు 425 స్కూళ్లను సందర్శించి, 65వేల మంది విద్యార్థులకు, తల్లితండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. దీనిలో 11 గ్రామాలను, సిటీలను ఎంపిక చేసుకుని అక్కడ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న స్వచ్ఛంధ సేవాసంస్థలతో కలిసి పనిచేసినట్టు రమేష్‌ వివరించారు. కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన కరాటే రికార్డ్‌ చాంపియన్‌ అమినేష్‌ వర్మను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ వైజాగ్‌ కపుల్స్‌ ప్రెసిడెంట్‌ రాధిక, వైభవ్‌ జ్యుయలర్స్‌ ఎండీ గ్రంధి మల్లికా మనోజ్, అంతర్జాతీయ స్కేటర్‌ రాణా, ఆంధ్రప్రదేశ్‌ యువజన రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్, రోటరీ క్లబ్‌ సభ్యులు సుభోధ్, ప్రకాష్‌, అధిక సంఖ్యలో విద్యార్థులు, వాకర్స్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు