హైదరాబాద్‌లో ఇల్లు అమ్మేసుకుందట..

3 Dec, 2019 08:07 IST|Sakshi

సినిమా: నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ మీడియా వారిపై చిర్రుబుర్రులాడింది. అందుకు కారణం లేకపోలేదు. హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈ ముంబై బ్యూటీ హిందీ, తమిళం సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా, తెలుగులో మాత్రం కొంత కాలం బాగానే ఏలింది. అయితే ఇప్పుడు అక్కడ అవకాశాలు పూర్తిగా నిల్‌. దీంతో రకుల్‌ప్రీత్‌సింగ్‌ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అదే ఈ అమ్మడికి చిర్రెత్తించింది. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తున్న సమయంలో  హైదరాబాద్‌లో మకాం పెట్టేసే ఆలోచనలో ఒక అందమైన ఇల్లును కూడా కొనేసుకుంది.

అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారు కావడంతో టాలీవుడ్‌ నుంచి మూటాముల్లె సర్దుకునే పనిలో భాగంగా అక్కడ ఇంటిని అమ్మేసుకుందని, బెంగళూర్‌లో కొత్తగా ఇల్లు కొనుక్కుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది రకుల్‌ చెవికి చేరడంతో మీడియాపై చిర్రు బుర్రులాడేసింది. తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ఇలాంటి వార్తలను పత్రిక వారు ఎలా సేకరిస్తున్నారో తెలియడం లేదని, వాస్తవాలను తెలుసుకోకుండా ఇలాంటి వార్తలను ఎలా ప్రచారం చేస్తారని విరుచుకుపడింది. తాను హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కున్నప్పుడు దాన్ని ఎంతో భాగ్యంగా భావించాను. అలాంటి ఇంటిని విక్రయించినట్లు, కొత్తగా బెంగళూర్‌ ఇల్లు కొనుగోలు చేసినట్లు నిరాధార వార్తలను ప్రచారం చేస్తున్నారు. కొంచెం అయినా వాస్తవాలు రాయండి అంటూ విరుచుకుపడింది. ఈ అమ్మడు అంతగా ఉక్రోష పడడానికి కారణం ఇల్లు విక్రయించిందన్న ప్రచారానికి కాదు. తనకు అవకాశాలు లేవన్న  ప్రచారం కారణంగానే కోపం ముంచుకొచ్చిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్‌ తమిళంలో శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా