నాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే..

17 Aug, 2017 00:47 IST|Sakshi
నాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే..

తమిళసినిమా: జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి గురించి ప్రతి యువతి కలలు కంటుంది. తను ఎలా ఉండాలనేది కూడా ముందుగానే ఊహించుకుంటుంది. ఇక సినీ కథానాయికలైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అలాంటి ముందు జాగ్రత్తలే తీసుకుంటానంటోంది.

ఈ జాణ కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసి నిలదొక్కుకోలేకపోయినా, టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌ పట్టం దక్కించుకుంది. ఇక కోలీవుడ్‌లో జయించడానికి తహతహలాడుతోంది. ఇప్పుడా ప్రయత్నంలోనే ఉంది. ప్రస్తుతం రెండు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. మహేశ్‌బాబుతో జత కట్టిన ద్విభాషా చిత్రం స్పైడర్‌తో పాటు, తమిళంలో కార్తీకి జంటగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రంపై రకుల్‌ప్రీత్‌సింగ్‌ చాలా ఆశలే పెట్టుకుంది. ఇక త్వరలో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్యతో డ్యూయెట్లు పాడడానికి రెడీ అవుతున్న ఈ అందగత్తే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న విషయమై ఒక భేటీలో పేర్కొంది. మంచి అందగాడై ఉండాలని అంతేకాకుండా మంచి పొడవైన వాడై ఉండాలని చెప్పింది. అంతకంటే ముఖ్యంగా మంచి వాడై ఉండాలని ఈ భామ పేర్కొంది. ఒక వ్యక్తి మంచి వాడా? చెడ్డవాడా అని చూసిన వెంటనే చెప్పలేమని, అందుకనే చూసి, కలిసి మెలిగి ఆ తరువాత తన ప్రవర్తన మంచి అనిపిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకే తాను పెళ్లికి తొందర పడడం లేదనీ రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పుకొచ్చింది.