అలా చేయకపోతే మెదడు పనిచేయదు

18 Sep, 2018 06:14 IST|Sakshi

సినిమా: సినీ పరిశ్రమ ఒక అందమైన లోకం. తారలు అందుకు తగ్గట్టుగా ఉండాలి. ముఖ్యంగా కథానాయికలు షో కేసు బొమ్మలా మెరుస్తూ ఉండాల్సిందే. అందుకు తగిన కసరత్తులు తప్పనిసరి. కొందరైతే స్లిమ్‌గా తయారవ్వాలి కాబట్టి కష్టపడుతూ వ్యాయామాలు చేస్తుంటారు. మరికొందరు శారీరక వ్యాయామాన్ని ఆరోగ్య సూత్రాల్లో ఒకటిగా భావించి అది లేకుంటే ఉండలేం అన్నట్టు ఇష్టపడి చేస్తుంటారు. ఈ రెండో రకానికి చెందిన నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ అమ్మడుకు ఇంతకు ముందున్న జోరు తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్కూటీకి టాలీవుడ్‌లో ఒకటీ అరా చిత్రాలే చేతిలో ఉన్నాయి. కోలీవుడ్‌లో రెండు మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్యకు జంటగా నటిస్తున్న ఎన్‌బీకే చిత్రం.

దీపావళికి వస్తుందనుకున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాల జాప్యంతో వెనక్కు వెళ్లిపోయింది. ఇది చిత్ర యూనిట్‌తో పాటు రకుల్‌ను నిరాశపరచే విషయమే. ఎందుకంటే కోలీవుడ్‌లో ఆ అమ్మడి చిత్రం విడుదలై చాలా కాలం అయ్యింది. ఎన్‌బీకే చిత్రంపై రకుల్‌ చాలా ఆశలు పెట్టుకుందట. దీని తరువాత కార్తీకు జంటగా నటిస్తున్న దేవ్‌ చిత్రం తెరపైకి రానుంది. అందుకు ఇంకా చాలా టైమ్‌ ఉంది. దీంతో ప్రేక్షకులు తనను మరిచిపోకూడదని ఏదో విధంగా వార్తల్లో ఉండటానికి ప్రయత్నాలు చేసుకుంటోంది.

అలా తాను కసరత్తులు చేస్తున్న ఓ దృశ్యాన్ని సామాజిక మాద్యమాలకు విడుదల చేసింది. ఈ సందర్భంగా రకుల్‌ పేర్కొంటూ తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని, అది చేయకపోతే తన మెదడు పని చేయకుండా ఆగిపోయినట్లు భావిస్తానని చెప్పింది. కసరత్తుల్లో భాగంగా అధిక బరువులు ఎత్తడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. రోజుకు కనీసం గంట పాటు కసరత్తులు చేస్తానని అంది. ఒక లారీ టైర్‌ను పైనుంచి కిందికి దించి దానితో పాటు పరిగెత్తే కసరత్తుల దృశ్యాన్ని ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ విధంగా రకుల్‌ ట్రిక్‌ పని చేసింది. ఉచిత ప్రచారాన్ని బాగానే పొందుతోంది.

మరిన్ని వార్తలు