రామ్ చరణ్, అఖిల్, జీవా... తొలిసారిగా స్టేజ్ డ్యాన్స్!

23 Jan, 2016 23:39 IST|Sakshi
రామ్ చరణ్, అఖిల్, జీవా... తొలిసారిగా స్టేజ్ డ్యాన్స్!

అవార్డు వేడుకలంటే ఆటా పాటా కామన్. హీరో, హీరోయిన్లు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తుంటే, హుషారుగా వన్స్ మోర్ అనాలనిపిస్తుంది. ఈ సందడితో పాటు సినిమా పరిశ్రమకు సేవలందించి, చరిత్రలో నిలిచిపోయిన పెద్దలను గౌరవించుకుంటే అప్పుడు ఆ వేడుకకు నిండుదనం వస్తుంది. ఈ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ‘ఐఫా-ఉత్సవమ్’ అవార్డుల వేడుక అత్యంత వైభవంగా ఈ విధంగానే జరగనుంది. జియోవన్ స్మార్ట్‌ఫోన్, రేనాల్ట్‌ల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ను అందిస్తోంది.

చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహానటుడు డా. అక్కినేని నాగేశ్వరరావు, శతాధికచిత్రాల నిర్మాత డా. డి. రామానాయుడు, దర్శక దిగ్గజం కె.బాలచందర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్‌లకు ఈ వేదికపై నివాళులర్పించనున్నారు. ఇంకా దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న వారిని సత్కరించనున్నారు. ఇక.. ఈ అవార్డు వేడుకలో సందడి గురించి చెప్పాలంటే...

మొదటిసారి లైవ్ పెర్ఫార్మెన్స్  ఇవ్వనున్న రామ్‌చరణ్
డ్యాన్సుల విషయంలో తన తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రామ్‌చరణ్. స్టయిలిష్‌గా డ్యాన్సులు చేసే చరణ్ ఇప్పటివరకూ ఆహూతుల ముందు ఏ వేదిక మీదా కాలు కదపలేదు. తొలిసారి ‘ఐఫా’ వేదికపై ఆయన డ్యాన్స్ చేయనుండడం విశేషం. ఈ అవార్డు వేడుకలకు చరణ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్చొచ్చు. వేదికపై రెచ్చిపోవడానికి గచ్చిబౌలి స్టేడియంలో రామ్‌చరణ్ చాలా హుషారుగా రిహార్సల్స్ చేస్తున్నారు.

అదిరిపోయేలా అఖిల్..
‘మనం’లో కొన్ని సెకన్లు కనిపించి, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని కితాబులందుకున్నారు అఖిల్. అలాగే మొదటి సినిమా ‘అఖిల్’తోనే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కున్నారు. ఈ చిచ్చరపిడుగు లైవ్ పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ‘ఐఫా’ వేదికపై అదిరిపోయే స్టెప్పులు వేయడానికి అఖిల్ కసరత్తులు చేస్తున్నారు.

వారెవ్వా అనిపించాలనుకుంటున్న జీవా..
తమిళ హీరో జీవా కూడా ఇప్పటివరకూ ఏ అవార్డు వేడుకలోనూ డ్యాన్స్ చేయలేదు. ఇప్పుడు ‘ఐఫా’లో రెచ్చిపోవడానికి రెడీ అయ్యారు. మొదటిసారి స్టేజీపై డ్యాన్స్ చేయనున్నారు కాబట్టి, ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా ఉంది జీవా వ్యవహారం. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి, అందరూ వారెవ్వా అనే విధంగా డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు.

 ప్రముఖుల సమక్షంలో... పసందుగా...
దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రరంగానికి చెందిన తారల అవార్డు వేడుక ఇది. ఈ వేడుకలో నాలుగు భాషలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాగచైతన్య తదితరుల నటులతో పాటు అందాల తారలు కాజల్ అగర్వాల్, మమతా మోహన్‌దాస్, కావ్యా మాధవన్ వంటివారి సమక్షంలో ఈ వేడుక పసందుగా జరగనుంది.

ఆ కలను ‘ఐఫా’ నెరవేర్చింది   - తమన్నా
సినిమాల్లోకి రాకముందు నేను ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుందామనుకున్నా. అనుకోకుండా సినిమాలకు అవకాశం రావడంతో అది నెరవేరలేదు. ఇప్పుడీ ‘ఐఫా’ కారణంగా అది నెరవేరింది. ఈ అవార్డుల వేదికపై నేను చేయనున్న డ్యాన్సులకు ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నారు. సోమవారం నా పెర్ఫార్మెన్స్ ఉంటుంది.

 నా స్టెప్స్‌ని కాపీ... పేస్ట్ చేయమన్నారు  - దేవిశ్రీ ప్రసాద్
నాకు ఒక పట్టాన ఏదీ నచ్చదు. ట్యూన్ చేయడం అయినా, పాట పాడడం అయినా, చివరికి డ్యాన్స్ చేయడం అయినా. అందుకే ఈ వేదికపై నాతో కలిసి డ్యాన్స్ చేసేవాళ్లకు కొన్ని స్టెప్స్ చూపించాను. షియామక్ దావర్‌కి అవి నచ్చడంతో ‘అందరూ కాపీ పేస్ట్ చేయండి’ అన్నారు.