తండ్రిగా గర్వ పడుతున్నాను: చిరంజీవి

19 Mar, 2018 00:44 IST|Sakshi
ఆది పినిశెట్టి, రవిశంకర్, మోహన్, నవీన్, చిరంజీవి, రామ్‌చరణ్, సమంత, దేవిశ్రీప్రసాద్, సుకుమార్, చంద్రబోస్‌

‘‘విశాఖకి వచ్చిన ప్రతీసారి ఆనందం, ఉద్వేగం అనిపిస్తుంది. విశాఖను చూస్తే నా సినిమాలు ‘ఆరాధన, అభిలాష’, ‘బంగారు కోడిపెట్ట..’ గుర్తుకొస్తాయి. మైత్రీ మూవీస్‌ మిత్ర త్రయానికి ధన్యవాదాలు. ముగ్గురి కో–ఆర్డినేషన్‌ చూస్తే ముచ్చటేస్తోంది. మంచి సినిమాలు  తీయాలని తపిస్తుంటారు. సుకుమార్‌ అద్భుతమైన పనితనం చూపించాడు. ఎన్నో సినిమాలు వచ్చాయి పల్లెటూరి నేప«థ్యంలో. ఇది చాలా ప్యూర్‌ సినిమా. సుకుమార్‌ ఎలా చెప్పాడో అలాగే తీశాడు.  పల్లె మనస్తత్వాలను బాగా చిత్రీకరించాడు. స్టార్టింగ్‌ నుంచి ఎండ్‌వరకు ఎంజాయ్‌  చేశాను. ఇది చరణ్‌కు స్టార్‌ స్టేటస్‌ను పెంచి నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించే సినిమా. ఆర్టిస్ట్‌గా ఈర్ష్య పడుతున్నాను.. తండ్రిగా గర్వ పడుతున్నాను’’ అన్నారు నటుడు చిరంజీవి.

రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగస్థలం’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై. రవిశంకర్, మోహన్‌  చెరుకూరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక వైజాగ్‌లో జరిగింది ఈ సందర్భంగా ‘‘చిరంజీవి మాట్లాడుతూ – ‘‘హీరోకి వినికిడి లోపం ఉంది అంటే ఫ్యాన్స్‌ ఎలా తీసుకుంటారో అని కంగారుపడ్డాం. అయితే చరణ్‌ ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేశాడు. నవ్వించాడు, ఏడిపించాడు. ఒక డీ గ్లామరైజ్డ్‌ పాత్రలో శభాష్‌ అనిపించుకున్నాడు. సుకుమార్‌ ఈ సినిమాకి అగ్రతాంబులాం. కర్త, కర్మ క్రియ. దేవిశ్రీ ప్రసాద్‌ చాలా అద్బుతమైన బాణీలు ఇచ్చాడు. చంద్రబోస్‌ తెలంగాణ బిడ్డ అయ్యుండి ఈ సినిమాలో గోదారి గడ్డ మీదుండే పల్లె పదాలను అంత చక్కగా రాయడం మాములు విషయం కాదు. ‘మీ పెన్నుకు నా వెన్ను’ వంచి నమస్కరిస్తున్నాను. ‘రోబో’ చేసిన రత్నవేలేనా ఈ సినిమా చేసింది అనిపించింది. జూబ్లీ హిల్స్‌లో విలేజ్‌ను సృష్టించారు. గ్రేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్స్‌ సెట్‌ వేస్తే అసలు సెట్‌ వేసినట్టు ఉండదు. ఆ వాతావరణాన్ని అలా క్రియేట్‌ చేసిన రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను. సినిమా చూశాక స్పెల్‌బౌండ్‌ అయ్యాను. కొడుకును హగ్‌ చేసుకుంది సురేఖ. విలేజ్‌ను చూసింది లేదు. రాణిస్తాడా లేదా అనుకున్నాను కానీ చాలా చక్కగా చేశాడు. డెప్త్‌కి వెళ్లి చేశాడు.

ఏడవకుండా ఏడిపించటం చాలా గ్రేట్‌. సమంత సమంతలా కనిపించలేదు. ఆమె హావభావాలు బాగా చూపించింది. ఈ సినిమాకు జాతీయ అవార్డులు రాకపోతే అన్యాయం జరిగినట్టే’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ‘‘సినిమా రషెస్‌  చూసినవాళ్లు చెప్పిన మాటేంటంటే చరణ్‌ మునుపెన్నడూ చేయనంత అద్భుతంగా చేశాడని. దేవిశ్రీ ప్రసాద్‌ తన సంగీతంతో సినిమాను లిఫ్ట్‌ చేశాడు. సుకుమార్‌ ఎంత గొప్ప డైరెక్టర్‌ అంటే సినిమా చేస్తానంటే చాలు ఏ హీరో అయినా తనకు డేట్స్‌ ఇచ్చేస్తాడు.

చిరంజీవిగారు వేసిన రహదారి మీదే ఇప్పుడున్న మెగా హీరోలంతా వెళ్తున్నారు. ఆయన పడ్డ కష్టమే ఇదంతా’’ అన్నారు. ‘‘చిన్నప్పటినుంచి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలనుకున్నాను. అది సుకుమార్‌ సినిమాతోనే నేరవేరటం హ్యాపీగా ఉంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌. ‘‘సుకుమార్‌గారు చాలా ప్రేమతో రాశారు రామలక్ష్మి క్యారెక్టర్‌. ఆయన గర్వపడేలా చేయాలని  చాలా కష్టపడి చేశాను. చిరంజీవిగారికి ‘స్వయంకృషి’ సినిమా ఎలానో  చరణ్‌కి ‘రంగస్థలం’ అలా అవుతుంది’’ అన్నారు సమంత.

సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు రాజకీయాల్లోకి వెళ్తుంటే దేవి ఓ మాట అన్నాడు. ముఖ్యమంత్రి పదవి కంటే మెగాస్టార్‌ పదవే పెద్దది కదా అని. అవును సార్‌.. ఎన్ని పదవులున్నా మెగాస్టార్‌ పదవి చాలా ప్రత్యేకం. చిరంజీవిగారు సినిమా చూసి ఇంటికి పిలిచారు. చిరంజీవిగారు అభినందించినప్పుడు పక్కన ఎవరూ లేరు. ఒకవేళ అది బయట చెబుదాం అంటే అబద్దం అనుకుంటారేమో అని భయం. అంత గొప్పగా పొగిడారు. మంచి ప్రొడ్యూసర్స్‌ దొరికారు. ఖర్చు దగ్గర అస్సలు వెనకాడరు.

ఒకవేళ నేను గుడ్‌ డైరెక్టర్‌ అని ఎవరైనా అంటే ఆ గుడ్‌ రత్నవేలు గారు. నేను  సినిమా చేయాలంటే కథ అవసరం లేదు, దేవి ఉంటే చాలు. మూడున్నర రోజుల్లో పాటలన్నీ కంప్లీట్‌ చేశాం. చంద్రబోస్‌గారు పాటలు ఎలా రాశారంటే ఒక కవి ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి పదాలు వస్తాయో అలాంటి పదాలు వాడారు. సమంతను లైఫ్‌ లాంగ్‌ డైరెక్ట్‌ చేయాలనుంది. అంత గొప్ప న టి. ఆర్ట్‌ డైరెక్టర్స్‌కు అవార్డు క్రియేట్‌ చేసి ఇవ్వాలని ఉంది. ఆది క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. చరణ్‌ చాలా తొందరగా క్యారెక్టర్‌లోకి వెళ్లిపోయాడు. చరణ్‌ ఫస్ట్‌ డే టేక్‌ చేయగానే చప్పట్లు కొట్టాం’’ అన్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ – ‘‘ప్రొడ్యూసర్స్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను డీల్‌ చేశారు. విజువల్స్‌ను రత్నవేలు తెరమీద అందంగా చూపించారు. ఊరిని బాగా పరిచయం చేసిన సుక్కుకి థ్యాంక్స్‌. షూటింగ్‌ చేసిన తర్వాత ఎందుకు సిటీలో ఉంటున్నామా? అనిపించింది. సిటీలో మనం కొంచెం కలుషితం అయిపోయాం. కానీ అక్కడి మనుషులు చాలా ప్యూర్‌గా ఉంటారు. గోదావరి నీళ్లు చాలా తియ్యగా ఉంటాయి. ఆది నిజంగా నాకు అన్నయలాగానే ఉన్నాడు. ఒక మంచి కో–ఆర్టిస్ట్‌ దొరికితే ఎంత బాగా చేయొచ్చో సమంత వల్ల తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన పాటలు ఇస్తే, చంద్రబోస్‌ గారు అద్భుతంగా రాశారు. సుక్కు ఒక కొత్త చరణ్‌ని నాకు పరిచయం చేశారు. ఆ చరణ్‌ మీద నాకు రెస్పెక్ట్‌ పెరిగింది. మార్చి 30 తర్వాత సుకుమార్‌ని చూడనా అని బెంగ పట్టుకుంది. అమ్మానాన్న, ఫ్యాన్స్‌ గర్వపడే ఒక సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత నవీన్‌ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి గారికి థ్యాంక్స్‌. చరణ్‌గారి విశ్వ రూపం చూస్తారు. సమంత అద్భుతంగా చేశారు. దేవిశ్రీ, సుకుమార్‌ టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ వేడుకలో ఉపాసన, పూజా హెగ్డే, ఆది, చంద్రబోస్, అనసూయ, రామకృష్ణ, మోనికా, రామ్‌–లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు