అందుకే... 11న వస్తున్నాం!

4 Jan, 2017 00:48 IST|Sakshi
అందుకే... 11న వస్తున్నాం!

‘‘బాలకృష్ణ గారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి, 12న మా చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. రెండు అగ్ర హీరోల చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం చిత్ర పరిశ్రమకి మంచి పరిణామం కాదని నాన్నగారు (చిరంజీవి) చెప్పడంతో మేం 11న రావాలని నిర్ణయం తీసుకున్నాం’’ – ‘ఖైదీ నంబర్‌ 150’ నిర్మాత, హీరో రామ్‌చరణ్‌

తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు? అనే ఉత్కంఠకు రామ్‌చరణ్‌ మంగళవారం ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ తేదీ, వేదిక విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 11న చిరంజీవి రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే 7న మంగళగిరి దగ్గర ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ జరుపుతున్నామన్నారు. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో కొణిదెల ప్రొడ క్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుకకి ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు, ‘దర్శకేం ద్రులు’ కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరవు తున్నట్టు రామ్‌చరణ్‌ చెప్పారు. ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా అభిమా నులతో సంభాషించిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

(చదవండి :‘ఖైదీ’ విడుదల తేదీ ప్రకటించిన చరణ్ )

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ – ‘‘కొన్ని అనుమతులు రాని కారణంగా ఇందిరాగాంధీ స్టేడియంలో (విజయవాడ) జనవరి 4న ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేయలేకపోతున్నాం. అందువల్ల, గుంటూరు– విజయవాడ హైవేలో ఉన్న హాయ్‌ల్యాండ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 7న ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తున్నాం. ట్రైలర్‌ కూడా 7న విడుదల చేస్తున్నాం. పలువురు దర్శక–నిర్మాతలు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ రోజు బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ను కలసి ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. వస్తారా? లేదా? అనేది ఆయన చేతుల్లోనే ఉంది’’ అన్నారు. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అని ఓ అభిమాని ప్రశ్నించగా... ‘‘ఇది పోటీ కాదు. రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల కావడమనేది సహజమే. పండక్కి ఎన్ని సినిమాలైనా రావొచ్చు. 2013 సంక్రాంతికి వెంకటేశ్, మహేశ్‌బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, నేను చేసిన ‘నాయక్‌’ సినిమాలు విడుదలయ్యాయి. రెండూ బాగా ఆడాయి.

మా సినిమాతో పాటు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు.  ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత చిరంజీవి నటించబోయే తదుపరి సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఉంటుందని రామ్‌చరణ్‌ స్పష్టం చేశారు. మరోవైపు ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి మంగళగిరి వద్దకు వెళ్లిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌... ‘‘సినిమాలను రాజకీయా లతో ముడి పెట్టొదు. చిత్ర పరిశ్రమలో రాజకీయాలపై అవసరమైన సమయంలో స్పందిస్తా’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.