అతి నిద్ర అనారోగ్యం

8 Dec, 2019 00:19 IST|Sakshi
శ్రీసింహా

అలుపు, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతిభ్రమణం.. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఇవన్నీ అతి నిద్రవల్ల వచ్చే అనారోగ్యాలు. శనివారం ‘మత్తువదలరా’ చిత్రం టీజర్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా విడుదల చేశారు హీరో రామ్‌చరణ్‌. టీజర్‌లో శుభోదయం కార్యక్రమంలో అతినిద్ర వల్ల వచ్చే అనర్థాల గురించి డాక్టర్‌ సలహాలు, సూచనలు వినిపిస్తుంటాయి. టేబుల్‌పై పడుకున్న హీరో మత్తువదిలి నిద్రలేస్తాడు. ఒక నిమిషం పాటు ఉన్న టీజర్‌లో కంటెంట్‌ ఇది.

సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతుండగా ఆయన పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. రితేష్‌ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతలు నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ –  ‘‘రంగస్థలం’ సినిమా టైమ్‌లో నేను సింహాతో కలిసి వర్క్‌ చేశాను.

ఆ ప్రయాణం మరచిపోలేనిది. మా నటుల ప్రపంచంలోకి సింహాకు స్వాగతం పలుకుతున్నా. కాలభైరవ విలక్షణ గాత్రానికి నేను పెద్ద అభిమానిని. తన పాటలను వినాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు. డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యంగ్‌ టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చిత్రం నిర్మించాం. హాస్యంతో కూడిన మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ఇది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిచయం కాబోతున్నారు’’ అన్నారు.    

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా