‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

19 Sep, 2019 01:47 IST|Sakshi
రామ్‌చరణ్, సురేందర్‌ రెడ్డి

రామ్‌చరణ్

నరసింహారెడ్డిగారి కుటుంబ సభ్యులను కలిశాను. ఒక వ్యక్తి జీవితం వందేళ్ల తర్వాత చరిత్ర అవుతుంది.  సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. వందేళ్ల తర్వాత ఒక వ్యక్తి జీవితంపై ఎవరైనా సినిమా తీయవచ్చు. ఏ ప్రాబ్లమ్‌ లేకుండా గౌరవంతో తీయవచ్చు. లేటెస్ట్‌గా చెప్పాలంటే... మంగళ్‌పాండే అనే ఒక గ్రేట్‌ లీడర్‌ మన ఇండియాలో ఉన్నారు. ఆయన గురించి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వందేళ్లు కాదు... 65 ఏళ్లకు సినిమా తీయొచ్చన్నారు. ఒక కుటుంబానికి లేదా కొందరు వ్యక్తులకు నరసింహారెడ్డిగారిని లిమిట్‌ చేయడం అనేది నాకు అర్థం కావడం లేదు. ఆయన దేశం కోసం పని చేశారు. ఉయ్యాలవాడ కోసం ఉన్నారు. రేపు నేను ఏదైనా చేయాలి అనుకుంటే ఊరి కోసం చేస్తాను. ఆ జనాల కోసం చేస్తాను. ఒక కుటుంబానికి లేదా ఓ నలుగురు వ్యక్తులకు నేను చేయను. అలా చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి స్థాయిని తగ్గించలేను. 

ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, సుదీప్‌ వంటి స్టార్లు నటించడానికి సగం చిరంజీవిగారి బలం అయితే.... వీరందరూ వచ్చి ఆయనతో కొంత సమయమైనా స్క్రీన్‌పై కనిపించాలి అనేది ఒక ఉద్దేశం అయితే ... మహానుభావులు నరసింహారెడ్డిగారి బలమే చిరంజీవిగారిని, వీరందర్నీ సినిమా చేసేలా చేసింది. – రామ్‌చరణ్‌

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో అక్టోబరు 2న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, సురేందర్‌ రెడ్డిలతో పాటు ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత∙రమేశ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ – ‘‘పదేళ్ల క్రితం నాన్నగారు ఓకే చేసిన సబ్జెక్ట్‌ ఇది. సరైన సమయంలో సరైన బడ్జెట్‌.. టెక్నీషియన్స్‌ ఇలా అన్నీ సహకరించినప్పుడే సినిమా తీయాలనుకున్నాం. దర్శకుడు సురేందర్‌ రెడ్డిగారు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌గారు అందరూ చిరంజీవిగారి పాత్ర ఎలా ఉండాలి? ఎలాంటి కాస్ట్యూమ్స్‌ వాడాలి? అని చర్చించుకుని డిజైన్‌ చేయించారు. వాటిని నాన్నగారు ఫాలో అయ్యారు. నాన్నగారికి ఈ వయసులో ఆ గెటప్‌ కుదరడం అదృష్టం. బాబాయ్‌ (పవన్‌ కల్యాణ్‌) వాయిస్‌ ట్రైలర్‌లోనే కాదు.. సినిమాలో కూడా ఉంటుంది. సురేందర్‌ రెడ్డిగారి దర్శకత్వంలో ‘ధృవ’ సినిమాలో హీరోగా నటించిన తర్వాత ‘ఇంటెన్స్‌ ఫిల్మ్స్‌’ని కూడా బాగా తీయగలరని అర్థమైంది. ‘సైరా’కి  ఆయనే మంచి ఆప్షన్‌ అనిపించింది. నిర్మాతగా ఉండటం చాలా టఫ్‌ అనిపించింది. నాన్నగారు, పరుచూరిగారు మొదలుపెట్టిన ఒక థాట్‌ తెరపైకి రావాలి అంటే అందరూ చాలా రెస్పెక్ట్‌గా తీయాలి. డబ్బులంటే, దర్శకులు ఉంటే సరిపోదు. ప్యాషన్, క్రమశిక్షణతో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. చాలా గౌరవంతో ఈ సినిమా తీశాం. రికార్డ్స్‌ గురించి ఆలోచించి ఖర్చు పెట్టలేదు. రికార్డులు కాదు.. మాకు తిరిగి డబ్బులు వస్తాయా? రావా? అని కూడా ఆలోచించకుండా ప్యాషనేట్‌గా చేశా’’ అన్నారు. 

సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ ప్రాజెక్ట్‌ నా దగ్గరకు వస్తుందని ఊహించలేదు. వచ్చాక ఈ సినిమా చేయడానికి పదిహేను రోజులు టైమ్‌ అడిగాను. చిరంజీవిగారు హీరోగా చేస్తున్న ఇంత భారీ స్కేల్‌ మూవీ నేను చేయగలనా? అనే విషయం గురించి ఆలోచించుకోవడానికి అంత టైమ్‌ అడిగాను. నాకప్పుడు ఎదురుగా కనిపించింది చిరంజీవిగారు ఒక్కరే. ఆయన లైఫ్‌ కనిపించింది. ఆయన  ఎంత కష్టపడ్డారు. ఎంత ఎత్తుకు ఎదిగారు అన్నది కనపడింది. అలా ఆయన స్ఫూర్తితో చరణ్‌గారు నా వెనకాల ఉన్నారన్న ధైర్యంతో ముందుకు వెళ్లడం జరిగింది. మాకు దొరికిన ఆధారాలను బట్టి ఈ సినిమా చేశాం. సినిమా స్టార్ట్‌ చేసే ముందు నరసింహారెడ్డిగారి గురించి నాకు తక్కువ తెలుసు. ఆరు నెలలు పరిశోధించి, ఆయన గురించి తెలుసుకున్నాను. పుస్తకాలు చదివాను.

నేనూ పోచ బ్రహ్మానందరెడ్డిగారు అని ఇప్పుడు నంద్యాల ఎంపీ... ‘రేనాటి సూర్యచంద్రలు’ అనే ట్రస్ట్‌కు ఆయన అధ్యక్షులు. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఒక బుక్‌ ఇచ్చారు. నరసింహారెడ్డిగారి పేరు మీద ప్రభుత్వం విడుదల చేసిన స్టాంప్‌ను ఇవ్వడం జరిగింది. నా మిత్రుడు ప్రభాకర్‌ రెడ్డి ద్వారా చెన్నై నుంచి నరసింహారెడ్డిగారికి సంబంధించిన గెజిట్స్‌ని తీసుకుని వచ్చి రీసెర్చ్‌ చేయడం జరిగింది. ఈ సినిమా ముగింపు చరిత్రలో భాగమే. నరసింహారెడ్డి గారు ఏదైతే తన జీవితాన్ని త్యాగం చేశారో అదే విక్టరీ.  ఆయన తన మరణంతో బ్రిటిషు వాళ్లపై యుద్ధాన్ని స్టార్ట్‌ చేశాడు. ఇది విషాదాంత ముగింపు కాదు. ఈ సినిమాకు అదే విజయం. ఈ సినిమాకున్న ప్లస్‌ పాయింట్‌ అదే. ఇది నేను రికార్డ్స్‌ కోసం చేసిన సినిమానో, ‘బాహుబలి’లాంటి సినిమా చేయాలనో చేయలేదు. చరణ్‌గారు నాతో ‘‘మా నాన్నకి నేను ఒక పెద్ద గిఫ్ట్‌ ఇవ్వాలి. ఆయన 150 సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నింటిలో ఈ సినిమా నంబర్‌ వన్‌గా ఉండాలి. నాన్న పేరు ఈ సినిమా ద్వారా హిస్టరీలో ఉండాలి’ అన్నారు. ఆ ఫీలింగ్‌తోనే ఈ సినిమా స్టార్ట్‌ చేశారు. మంచి సంకల్పంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు