మా సినిమాను ఆపాలనుకున్నవారి పేర్లు బయటపెడతా

12 Dec, 2019 00:22 IST|Sakshi
రామ్‌గోపాల్‌ వర్మ

‘‘మా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారు. ఎవరెవరు ఆపడానికి ప్రయత్నించారో వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతా. సినిమా ఆపడానికి ప్రయత్నించినవారిపై పరువు నష్టం దావా కూడా వేస్తాం. 2019 మే నుంచి సెప్టెంబర్‌ మధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశాం. ఇదంతా ఫన్నీగా ఉంటుంది’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ప్రస్తుతం ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ సినిమా పనుల నిమిత్తం చైనాలో ఉన్నారు వర్మ. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆన్‌లైన్‌ ద్వారా ఆయన పై విధంగా మాట్లాడారు. రామ్‌గోపాల్‌ వర్మ తన టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై అందిస్తున్న చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్‌గోపాల్‌ వర్మతో కలసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు.

టి.అంజయ్య సమర్పణలో అజయ్‌ మైసూర్, టి. నరేష్‌కుమార్, టి.శ్రీధర్‌ నిర్మించిన ఈ చిత్రానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ సహ నిర్మాతలు. వర్మ ఆన్‌లైన్‌ ప్రసంగం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, అంజయ్య మాట్లాడుతూ – ‘‘మా సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో గురువారం విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కోసం 15 రోజులుగా యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో విజయం సాధించాం. సినిమాని ఆపడానికి ఎవరు ప్రయత్నించారో గురువారం మధ్యాహ్నానానికల్లా ప్రతి ప్రేక్షకుడి ఊహకు తెలుస్తుంది. ఆపాలని ప్రయత్నించినవారిపై వర్మ చెప్పినట్లుగానే పరువు నష్టం దావా వేస్తాం. ఈ సినిమాకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెన్సార్‌ బోర్డ్‌ యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చింది’’ అన్నారు.

మరిన్ని వార్తలు